పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/376

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీతాపతిశతకము

365


మ.

బహుజన్మంబులనుండీ చేసినమహాపాపంబుల న్బాపఁగా
గ్రహదోషంబు లడంప దుస్సహదరిద్రవ్యాధులన్ ద్రుంపఁగా
నిహసౌఖ్యంబు లొసంగి భక్తులమనం బింపొందఁజేయ న్రఘూ
ద్వహ! నీనామజపంబె చాలు నిముషార్ధం బైన సీతాపతీ.

58


శా.

ధీరుండై భవబంధము ల్దునిమి ధాత్రిం బూజ్యుఁడై సంతత
శ్రీ రంజిల్లుచు నీయనుగ్రహమున న్జెన్నొంది యాపిమ్మట
న్జేరున్ మోక్షపదంబు శాశ్వతముగా సిద్ధంబు వైవస్వత
ద్వారం బెన్నఁడుఁ దేరిజూడఁడు భవద్భక్తుండు సీతాపతీ.

59


మ.

ధర నావంటి మహాపరాధుఁ డిఁక మర్త్యశ్రేణిలో లేడు ని
ర్జరు లెన్నంగను నీకుమించ నిఁక నార్తత్రాణదీక్షాధురం
ధరులైనన్ మఱి లేరు సత్య మిఁక నీదాసుండనై "యన్యథా
శరణం నాస్తి” యటన్న న్యాయమున నిచ్చ ల్గొల్తు సీతాపతీ.

60


శా.

ఆర్తత్రాణకళాప్రవీణుఁడవు నీవంచున్ మదిం దోఁచె నా
ధూర్తత్వంబు సహింప నెవ్వరు సమర్థుల్గారు నీకన్న నేఁ
“గర్తవ్యం మహదాశ్రమం” బనెడు వాక్యం బెంచి నిన్ గొల్చెద
న్మార్తాండాన్వయవార్ధిశీతకర న న్మన్నించు సీతాపతీ.

61


శా.

వింటి న్నీసరి వేల్పు లేడని జగద్విఖ్యాతిగా నన్ను నీ
బంటున్ గాఁ గృపఁజూడుమంటి నొరులం బ్రార్థించలేనంటి నా