పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/364

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీతాపతిశతకము

353


మ.

పరుసం బించుక సోక లోహ మపుడే బంగారమైనట్లు నీ
వరకళ్యాణగుణస్తవం బగుట నే వాక్రుచ్చు కబ్బంబునం
దరయం దప్పులు గల్గియున్న నవి యోగ్యంబౌచు నెల్లప్పుడున్
ధర జెన్నొందును గాక భక్తజనహృద్యం బౌచు సీతాపతీ.

8


శా.

కన్యావిక్రయులై ధనంబున కపేక్షం జెంది లోకంబునం
దన్యాయం బొడిగట్టుకోఁదలఁచి దుర్వ్యాపారు లూహింప సా
మాన్యప్రాభవ మిచ్చయించిరకటా మర్త్యాళి శిక్షింపలే
రన్యుల్ నీవు సహించియుండుటకు చోద్యంబయ్యె సీతాపతీ.

9


మ.

తనయుల్ గల్గినఁ గల్గు సద్గతులు తథ్యంబంచుఁ బుత్రార్థులై
మును ధన్యుల్ మదిఁ గోరియుందు రిపు డీమూర్ఖాళి సత్కన్యకా
జననంబైనను విక్రయించెద మభీష్టప్రాప్తిగా ద్రవ్యమా
ర్జనఁ గావించెదమంచు నెంతు రిది మే రా చూడ సీతాపతీ.

10


మ.

అనఘుల్ తొల్లి జగత్ప్రసిద్ధమగు కన్యాదానసత్పుణ్యమం
దనురక్తిన్ ధర జేయుచుండి రిపు డర్థాపేక్షచే దుష్కృతం
బని డెందమున లేక యాత్మభవకన్యావిక్రయోల్లాసులై
మను దుర్మార్గుల శిక్ష సేయ విది ధర్మం బౌనె సీతాపతీ.

11