పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/316

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రమాధీశ్వరశతకము

305


మ.

యదువంశోత్తముఁడైన నిన్నుఁ గ్రతుపూజార్హుండు గాఁడన్నదు
ర్మదునిన్ జైద్యుని జేతిచక్రమునఁ దన్మస్తంబు వేద్రుంచి ద్
పదిమానంబును గాఁచి శక్రజునకున్ బ్రత్యక్షమై విందవై
విదురాక్రూరుల మెచ్చినాఁడవట గోవిందా రమాధీశ్వరా.

47


శా.

సద్యోముక్తికరంబు పావనము సంసారాబ్ధిపోతంబు సం
పద్యోగంబు విరించిపంచముఖసంభావ్యంబు మంత్రోత్తమం
బద్యారాధ్యము భక్తలోకపరమాహ్లాదంబు సౌమ్యక్రియా
విద్యాసారము మీశుభాహ్వయము గోవిందా రమాధీశ్వరా.

48


శా.

సుశ్రావ్యంబులు పుణ్యమూలములు వస్తుజ్ఞానసామర్థ్యయో
గశ్రీకారములు సుధాసదృశముల్ కైవల్యసోపానముల్
మిశ్రంబుల్ నిగమాంతసారములలో మీనామసంకీర్తనల్
విశ్రాంతంబులు దివ్యదేశములు గోవిందా రమాధీశ్వరా.

49


శా.

కత్తుల్ మోహలతావిభంజనకృతిన్ గైవల్యవృక్షంపుఁబూ
గుత్తుల్ యుక్తులు సర్వమంత్రములకున్ ఘోరాహిత శ్రేణికిన్
మిత్తుల్ భక్తులు నారదాదులకుఁ దా మీనామసంకీర్తనల్