ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొలిపలుకులు

ప్రాచీన హిందూదేశము

---:o:---

ద్రావిడులు.

రామాయణ కథాకాలమునాఁడు హిందూదేశమెట్లున్నదో విచారింపకమున్ను తత్పూర్వ స్థితిగతులను దెలిసికొనుట యుచితమగుటయే కాక యవశ్యమనికూడ భావింతుము. ఇయ్యవి తెలిసికొనినఁగాని శ్రీరామచంద్రుఁడు భగవదవతారముగాఁ జేయఁబడుటకుఁగల కారణములు సులభముగా బోధపడవు. ఇందుచేతనే రామాయణ కాలమునాఁటికిఁ బూర్వమున్న హిందూదేశ పరిస్థితులనుగూర్చి యిచ్చట శాఖాచంక్రమణముగా నైనను ముచ్చటింపఁ బూనుకొంటిమి. ఉత్తర కురుభూముల నుండి యార్యులు హిమాలయ పర్వత సానువులఁబడి, కనుమలగుండ, హిందూ దేశముఁ జొచ్చు నప్పటికే యీదేశము జనాకీర్ణము కాకపోయినను, మానవ సంవాసితమై యుండెననుటకు సందియము లేదు. నాగరికత యందు హెచ్చులొచ్చులున్నను, నీ యాదిమ వాసులెల్ల రొక్కజాతి వారనుట యనుమానాతీతంబు; వీరె వేదములు మొదలగు తొలిబలుకుల యందు దస్యులనియు, బురాణముల యందును, నైతిహ్యముల యందును, గొన్ని మహాకావ్యముల యందును రాక్షసులనియు, వానరులనియు, స్మృతుల యందు ద్రావిడులనియుఁ శూద్రులనియుఁ బేర్కొనబఁడిరి. కొందఱి యభిప్రాయముననీ జాతి యార్యులకన్న నధిక నాగరికత కలదనియుఁ గొందఱి మతమున నటుకాదనియు నేఁడు వినుచున్నాము; కాని యార్యులకన్న నాగరికత యందు వెన్నడి యుండె ననియుఁ, దారతమ్యము మాత్రమత్యల్ప మనియు, మాయాశయము. కాకున్న నార్యులు వీరలను రాక్షసాది నామములచే వ్యవహరింప సాహసించి యుండరు. సంస్కృత గ్రంథములు వివేకము మాని గొంతెత్తి చెప్పుచున్నట్టు వీరు పచ్చిమాంసమును, నరమాంసమును దినెడు వారాయనునది. విచారణీయము. విరోధులను గౌరవభావముతో జూచి యున్న సౌజన్యమును, సౌశీల్యమును నొప్పుకొనుట మానవ స్వభావముకాని యట్టు కన్పట్టుచున్నది. నేఁడు జర్మను భాషాగ్రంథములు చదివినవారికి