పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/62

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవి చౌడప్ప శతకము

క.

శ్రీకారము పద్యాదిని
బ్రాకటముగ నుండెనేని బహుదోషములన్
బోకడఁచి శుభము లొసఁగును
గాకోదర కుందవరపు కవి చౌడప్పా.

1


క.

శ్రీపతి పుల్లురిపట్టణ
గోపాలుఁడు సదయుఁ డగుచుఁ గుంతీసుతులన్
గాపాడునటులు మమ్మును
గాపాడును కుందవరపు కవి చౌడప్పా.

2


క.

ఉండఁగ నిచ్చును నీపైఁ
బాండవమధ్యమునిమీఁది పక్షము గోపా
లుండవు పుల్లురివాసుఁడ
ఖండితయశ కుందవరపు కవి చౌడప్పా.

3


క.

ఎంతెంతో దీర్ఘాయు
ష్మంతుఁడవై మిగుల బుద్ధిమంతుఁడవై శ్రీ
మంతుఁడవై మను లక్ష్మీ
కాంతుని కృపఁ గుందవరపు కవి చౌడప్పా.

4


క.

వెయితల లొక వెయికన్నులు
వెయిచేతులు పదములొక్క వెయిగల పురుషుం
డియ వలయును దీర్ఘాయువు
గయికొమ్మని కుందవరపు కవి చౌడప్పా.

5