పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/44

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

సారాసారకృపా కటాక్షమున నిచ్చల్ భూర్భువ స్వస్త్రిలో
కారూఢాఖిల జంతుజాలముల నెయ్యం బొప్పఁగాఁ బ్రోచు ని
న్నారాధించి సుకింపలేక శిలలం బ్రార్ధింతురెంతే నప
స్మారభ్రాంతి మదాత్మ మూఢులిల రామా! భక్తమందారమా!

30


మ.

సరసీజాత భవాభవామరుల్ చర్చింప మీ మాయ గా
నరటంచున్ సతతంబు ప్రాఁజదువులు న్నానా పురాణంబులున్
సరస ప్రక్రియఁ జాటుచుండఁగఁ బిశాచప్రాయు లెంతేని సో
మరిపోతుల్ నరులెట్లు గాంచెదరు? రామా! భక్తమందారమా!

31


శా.

ధర్మంబంచు నధర్మమంచుఁ గడు మిధ్యాలీల లృ పారఁగా
నిర్మాణం బొనరించి ప్రాణులను నిర్నిద్ర ప్రభావంబులన్
బేర్మిం జెందఁగఁ జేసి యంత్రకుగతిన్ బిట్టూరకే త్రిప్పు నీ
మర్మం బెవ్వ రెఱుంగఁగాఁ గలరు? రామా! భక్తమందారమా!

32


మ.

వ్రతముల్ పట్టిన, దేవభూసుర గురువ్రాతంబులం గొల్చి నం
గ్రతు తంత్రంబులు దానధర్మము లపారంబౌనటుల్ చేసినన్
శతవర్షంబులు గంగలో మునిఁగినన్ సంధిల్లునే ముక్తి దు
ర్మతికిం దావక భక్తి గల్గమిని? రామా! భక్తమందారమా!

33


శా.

సందేహింపక కొంచకెప్పుడు హృదబ్జాతంబులో భక్తి నీ
యందంబై తగుమూర్తి నిల్పికొని యత్యాసక్తి సేవించువాఁ
డొందుం గుప్పున వాంచితార్ధములు బాగొప్పారు వందారు స
న్మందారంబవు గావె నీ వరయ రామా! భక్తమందారమా!

34


మ.

అరిషడ్వర్గముఁ బాఱద్రోలి సకలవ్యామోహముల్ వీడి సు
స్థిర యోగాంతర దృష్టి మీ చరణముల్ సేవించు పుణ్యాత్మకుల్
వరవైకుంఠపురాంతరాళమున భాస్వల్లీలలన్ ముక్తి తా
మరసాక్షీ రతికేలిఁ జొక్కుదురు రామా! భక్తమందారమా!

35