పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/26

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

ఏణాంకుండొకఁడై పయోఘటములందెల్ల న్బహుత్వంబుచే
రాణం బొల్చు తెఱంగునం బృథుతర బ్రహ్మాండభాండాంతర
ప్రాణిశ్రేణులయందు నీ వొకఁడవే రాణింతువౌ సర్వగీ
ర్వాణస్తుత్యచరిత్ర! యాత్మమయ! భర్గా! పార్వతీవల్లభా!

48


శా.

ఓంకారప్రముఖాక్షరోచ్చరణ సంయోగంబు గావేన్ముఖా
లంకారార్థము, శబ్దబిందుకళలున్ లక్ష్యప్రయోగక్రియల్
పొంకంబౌగురుమార్గముల్ యతిగతిం బోదుష్కృతింబోలిసా
హంకారుండయి ప్రాకృతుండు చెడు భర్గా! పార్వతీవల్లభా!

49


మ.

అకలంకం బతులం బఖండ మమృతం బానందకందం బనూ
నక మాద్యంతవిహీన మక్షర మనంతం బప్రమేయం బరూ
పకమవ్యక్త మచింత్యమద్వయమునౌ బ్రహ్మంబునీవంచుఁగొం
కక లోఁ గన్గొనువారు బల్లిదులు భర్గా! పార్వతీవల్లభా!

50


శా.

ఆకుల్ మెక్కదెమేఁక? చెట్టుకొననొయ్యన్ వ్రేలదేపక్షి? పె
న్గాకుల్ గ్రుంకవెనీట? గాలిఁగొనదే నాగంబు? బల్గొందులన్
ఘాకంబుండదె? కోనలం దిరుగదే క్రోడంబు? నిన్గాంచినన్
గా కిన్నింటను ముక్తిచేకుఱునె? భర్గా! పార్వతీవల్లభా!

51


మ.

ధర మృద్దారుశిలామయప్రతిమలన్ దైవంబు లంచుం బర
స్పరవాదంబులఁ బోరుచున్ నిబిడసంసారాంధులై మేలు చే
కుఱకే మగ్గములోని కండెలగతిన్ ఘోరార్తులై ప్రాకృతుల్
కరముం జచ్చుచుఁబుట్టుచుంద్రుగద! భర్గా! పార్వతీవల్లభా!

52


మ.

జననీగర్భ మహామహోగ్రనరక స్థానవ్యథం గొన్నినా
ళ్లెనయన్ బాల్యకుమారతాదశలఁగొన్నేడుల్ వధూమీనకే
తనగేహభ్రమఁగొన్నినాళ్ళు ఘనవృద్ధప్రాప్తిఁ గొన్నేళ్ళుఁబా
యనిదుఃఖంబులఁ బ్రాణి గుందుఁగద? భర్గా! పార్వతీవల్లభా!

53