పుట:2015.373190.Athma-Charitramu.pdf/79

ఈ పుట ఆమోదించబడ్డది

11. పునర్విమర్శనము 41

ఇదిగాక, నాతో కోనసీమకు వచ్చిన మిత్రుఁ డొక్కఁడే 1888 వ సంవత్సరమున నాకు సావాసుఁ డనియు, ఇతరస్నేహితు లందఱు నాశ్రేయస్సును గోరిన విశుద్ధప్రవర్తను లయ్యును ఆతరుణమున నాకు దూరస్థు లైరనియును, జెప్ప వలనుపడదు. అపుడును శాస్త్రి వెంకటరావు లిరువురును నాయాంతరంగిక మిత్రులె. పాపయ్యశాస్త్రితోకంటె వారితోనే నాకుఁ బ్రకృతమునను జనవెక్కువ. వారి. సంభాషణములుగూడ వొక్కొకతఱి కామోద్రేక జనకములుగ నుండెడివి. ఆకాలపు విద్యార్థులును "కొక్కోకము", "లండను నగరరహస్యములు" మున్నగు నిషిద్ధపుస్తకపఠనము చేయుటకు వెనుదీయకుండెడివారలె.

ఆసంవత్సరమున నాశీలమునకుఁ గలిగినశోధన, అవాంతరముగ నాపాదించిన యనర్థ మని చెప్ప వలనుపడదు. ఏండ్లకొలఁది జననీజనకులయదుపులో నుండి, సంతతవిద్యాభ్యాసమున కలవాటుపడి, యౌవనప్రాదుర్భావమున నిపు డొకసారిగ స్వేచ్ఛావిహారమును జని చూచిన యొకయువకుఁడు, దినములకొలఁది కట్టుఁగొయ్యనఁ బడియుండి మెడకొలికి సడలినపశువువలెఁ జెంగుచెంగునఁ బరువులిడుచు, మితిమీఱిన స్వచ్ఛందవర్తనమున మెలంగ నపేక్షించుట స్వాభావికమె. సంకల్పరూపమున నిదివఱ కణఁగియుండిన వాంఛా బీజములు, ఇపు డవకాశము దొరకినకారణమున మొలకలెత్తి విజృంభింపసాగును. దీని కొకరి ననవలసినపని లేదు. ఇట్టిపరిస్థితులలో పరులదుస్సహవాసము కేవల నిమిత్తమాత్రమె. కఠినశోధనల కెల్ల వేరు విత్తగు నాంతరంగిక దుస్సంకల్పముల నరికట్టలేక, పాపభారమును పరులబుజములమీఁదఁ బడవేయుట, ఇంటిదొంగను విడిచిపెట్టి బైటిదొంగకై పరుగులిడుటవలె నుండును !