పుట:2015.373190.Athma-Charitramu.pdf/676

ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 634

పాటుపడు మీబోటివారలమీదనే యున్నది. ఆ సమయమున మన మిత్రులు పలువురు వచ్చెదరని నమ్మెదను. నా చరిత్రము నాంగ్ల గ్రంథరూపమున మీరు ప్రచురింతురని "సంఘ సంస్కారిణీ పత్రిక"లోప్రకటనయున్నది. మీకు గావలసిన పరికరము లున్నవా ? నేను నా "స్వీయ చరిత్రము"న రెండు ప్రకరణములు వ్రాసితిని. 40 పుటలు అయినవి. అవి మీకు బంపనా ? మీ కళాశాల యెపుడు తీయుదురు ?

మిత్రులు, కం. వీరేశలింగము.

(10)

మద్రాసు, 28. జూలయి, 1903

ప్రియమిత్రులకు, మీరు పంపిన పదిరూపాయిలు చేరినవి. వందనములు. మీ ఆరోగ్యము ససిగా లేనందుకు విచారము. త్వరలో బాగుపడునని తలంచెదను. మీ స్థితిగతులు నాకు బాగా తెలిసియె యున్నవి. నాకు మీరు ధనసాహాయ్యము చేయగలరని నే ననుకొనుట లేదు. ఆ విషయమై నాచేత నైనంత వఱకు నేనె చేసెదను. సహాయకుల కొఱఁతయె నన్ను బాధించుచున్నది. నా తదనంతరము వితంతు శరణాలయ మెట్లు జరుగునా యనియె విచారించుచున్నాను. నా బలహీనతను బట్టి చూడగా, త్వరలోనే నాకు మరణము సంభవించునని తలంపవలసియున్నది. అన్నిటియందును దైవ సహాయమునె నే నాశించుచున్నాను. ఎదురుచూడని దిక్కునుండి యాయనప్రేరణచేతనే కార్యసాధకులును రాగలరు.

సౌ. సీతమ్మగారు రచించిన పుస్తక ప్రతి మీకు అందినదా ? ఆరోగ్యమున కామె యిచటనే యున్నది.

కం. వీరేశలింగము.