ఆత్మ చరిత్రము 632
(8)
"బ్రహ్మకృపా హి కేవలం"
సికందరాబాదు, 22 వ ఏప్రిలు 1902
ప్రియసహోదరా, అతి బాల్యముననే కాలగతి నొందిన తమ్ముని (సూర్యనారాయణను) గుఱించి, బ్రదికియున్న మనకు వేదనయు, హృదయపరితాపమును ! కొఱగానిదీపమె ప్రమిద యడుగు వఱకును కాలునట్లు కానబడును. కాని, అతనికిమాత్రము అది యింటి దెసకు పయనమె ! మంచి సువాసన లిచ్చు గులాబి, యజమాని పూజకై, కోయబడినట్టులె ! ఇట్టి తలంపునందె యోదార్పుగలదు. లేనిచో, యాలోచన కయోమయమును, భావనకు బాధాకరమును, అన్నిటికి నాటంకమును ! మనము శోకింపకుండ నుండలేము. దైవమును విశ్వసింపక తప్పదు. ఈశ్వరుఁడు మనకు శుభాశయములు పురిగొల్పునుగాక!
మీకు పరీక్షాధికారియుద్యోగము తప్పిపోయినది. దీనికి కారణమగు మీ శరీరాస్వస్థతకుమాత్రమె నావిచారము. బోధించుటయెగాని, పరిశోధించుట మీ విధ్యుక్తముగాదు. దయామయుఁ డగు సర్వేశ్వరుడు మీకు చిరాయు వొసగి, ధర్మపథమున నడిపించుఁగాక !
"సంఘసంస్కారిణీ" పత్రికలో ముద్రితమయిన బుచ్చయ్య పంతులుగారిని గుఱించిన మీలేఖ మద్రాసు సమాజసభ్యులలో గొందఱికి కష్టముగ నున్నది. కాని, మీవ్రాత సత్యమునుండి దూరస్థము గాదని నానమ్మిక.