పుట:2015.373190.Athma-Charitramu.pdf/625

ఈ పుట ఆమోదించబడ్డది

28. ఉద్యోగవిరామము 585

28. ఉద్యోగవిరామము

1928 వ సంవత్సర ప్రారంభమున గూడూరులో మండల విద్యాశాలలకు సంబంధించిన యాటలపోటీలు జరిగెను. ఆసమయమున నేను గూడూరు వెళ్లి, మాపిల్లలకుఁ బ్రోత్సాహము గలిగించితిని.

నేను గుంటూరుకళాశాల వీడి నెల్లూరునకు వచ్చునపుడె, యిచట నైదువత్సరములు మాత్రమె యుండి యంతట నుద్యోగ విరామముచేతు నని మనస్సున సంకల్పించుకొంటిని. మెల్లూరుపురమున కళాశాలను నెలకొల్పి, దాని నభివృద్ధికిఁ గొనివచ్చుట మిగుల ప్రయాసకరకార్య మయ్యెను. 1920 వ సంవత్సరమధ్యమున పదునెనిమిది బాలురతో నారంభమయిన కళాశాల, 1928 వ సంవత్సరమున సుమారు 200 విద్యార్థులతో విరాజిల్లుచుండెను. ప్రతిసంవత్సరమును పెక్కండ్రు ఇంటరుమీడియేటు పరీక్షలో గెలుపొందుటయెగాక, వీరిలోఁ గొందఱు మొదటితరగతిలోఁ గూడఁ గృతార్థు లగుచువచ్చిరి. బోధకులును తగిన నైపుణ్యానుభవములు గలవారలే.

విద్యాబోధనమందు కళాశాలాపరిస్థితు లిట్లు ప్రోత్సాహకరముగ నుండినను, ఆర్థికవిషయముమాత్రము మిక్కిలి యసంతృప్తికరముగ నుండెను. కళాశాలకగు వ్యయములో విద్యార్థులజీతములు పోఁగా, మిగిలినదానిలో కొంత దొరతనమువారును, తక్కినది కళాశాలాధిపతులగు శ్రీ వెంకటగిరిరాజావారును వహింపవలయును. కళాశాల కేటేటఁ గావలసిన పుస్తకపరికరాదుల కగు వ్యయములో సగము దొరతనమువారును, మిగిలినది రాజాగారు నీయవలయును.