పుట:2015.373190.Athma-Charitramu.pdf/623

ఈ పుట ఆమోదించబడ్డది

27. నెల్లూరు గాలివాన 583

ఈ గాలివానవలన నెల్లూరుపురము పాడుపడెను. మా కళాశాల కమితనష్టము వాటిల్లెను. చుట్టుపట్టులనుండి యిండ్లు వాకిండ్లు పోయినవాండ్రు తండోపతండములుగ వచ్చి, కళాశాల వసారాలలో నివసించిరి. కొన్నిదినములవఱకును వా రెచటికిని గదల నేరకుండిరి. వారు వెడలిపోయినపిమ్మట, ఎంత పరిశుభ్రపఱిచినను, అడుగుపెట్టుట కాప్రదేశ మయోగ్యముగ నుండెను. ఇంతలో జనసమ్మర్దముచేత పట్టణమున విశూచియారంభమయ్యెను. ఏవీథులలోని చెత్త చెదారము లందె నిలిచి యుండెను. పురపాలకసంఘమువారి పరిచారకులు తమ పనులు మానివేసిరి. పట్టణము బొత్తిగ వాసయోగ్యము గాకుండెను.

కొన్నిదినము లపుడు కళాశాల మూసివేసి, మేము గుంటూరు ఏలూరు పురములు వెడలిపోయితిమి. చుట్టుపట్టుల కళాశాలలలోని విద్యార్థులు కొంద ఱపుడు, గుంటూరు కళాశాల కేతెంచి, ఆటలలోను, నుపన్యాసములలోను నొండొరులతో పోటీలు సలిపిరి. గుంటూరుకళాశాలలో ఉపన్యాసముల పోటీలు జరుపు సంఘమునకు నే నధ్యక్షునిగ నియమింపఁబడితిని. అపుడు రాజమంద్రి కళాశాలా విద్యార్థులు గెలు పొందిరి. వారలలో మా తమ్మునికుమారుఁడు సూర్యనారాయణ యొకఁడు.

ఆ సంవత్సరము నవంబరు తుదివారమందు ఆంధ్రవిశ్వవిద్యాలయమునకు కేంద్రస్థానము నిశ్చయించువిషయమున మద్రాసు శాసననిర్మాణసభయెదుట సాక్ష్య మిచ్చుటకుఁ గొందఱు కోరఁబడిరి. వారిలో నేనొకఁడను. రాజమంద్రినగరమె యీ గొప్పగౌరవమునకుఁ దగియున్నదని నేను గట్టిగఁ జెప్పితిని. కొందఱు బెజవాడ యనియు, కొందఱు విశాఖపట్టణము, అనంతపురముననియుఁ జెప్పిరి.