పుట:2015.373190.Athma-Charitramu.pdf/589

ఈ పుట ఆమోదించబడ్డది

22. గృహప్రవేశము 545

బడుచుండెనని లోకు లనుచుండిరి. ఈ పరీక్షవలన సంవత్సరమున కే నూఱురూపాయిలు నాకు వచ్చుచుండెను. గృహనిర్మాణమున కీ సొమ్మెంతో సహాయకారి యయ్యెను.

ఈ సంవత్సరమందలి వేసవియు మేము గుంటూరనే కడపితిమి. ఈమాఱు మండలసభలు దాచేపల్లిలో జరిగెను. రాజకీయ సభకు శ్రీచల్లా శేషగిరిరావుగా రధ్యక్షులు. స్థాయి సంఘమునకు నధ్యక్షుఁడనగు నేను సంఘసంస్కరణసభలో పాల్గొంటిని. దాచేపల్లిలోని నాగులేఱు, నాపరాలు, తమలపాకుఁదోఁటలును దర్శనీయములుగ నుండెను. భావికాలపు చిత్రకథారచనమున కీప్రదేశమును రంగస్థలముఁ జేయ సంకల్పించుకొంటిని.

గృహప్రవేశసమయమునకు మా మామగారు గుంటూరు రాలేదు. అప్పు డాయన కడియములో వ్యాధిగ్రస్తులయి యుండిరి. ఒకటి రెండు మాసములలోనె యాయన పరలోకప్రాప్తిఁ జెందిరి. పరీక్షల తొందరలో నుండినను నే నాయనను తుది దినములలోఁ జూడఁబోయితిని. నారాక కాయన మిక్కిలి సంతోషించి, నాసోదరుని పుత్రు నొకనిని నన్ను దత్తుచేసికొను మనియు, తనకుమారునితో వియ్య మందు మనియు నాకు హితబోధనముఁ జేసిరి. ఆదినములలోనె నాకళాశాలామిత్రులు పువ్వాడ వెంకటరెడ్డిగారును చనిపోయిరి.

శ్రీకొండ వెంకటప్పయ్యగారు చెన్నపురి శాసానిర్మాణసభ కభ్యర్థులుగ నిలువ నుద్దేశించి, వోటర్లను దర్శించుటకై గోదావరిజిల్లా కేగుచు, నన్ను, దమతో రమ్మనిరి. కావున నే నావేసవి సెలవులలో వారితో కాకినాడ, రామచంద్రపురము, అమలాపురము తాలూకాలు సంచారము చేసితిని. అమలాపురమున నుండఁగా