పుట:2015.373190.Athma-Charitramu.pdf/587

ఈ పుట ఆమోదించబడ్డది

21. గృహ శంకుస్థాపనము 543

యుక్తమని తోఁచి, నవంబరు 27 వ తేదీని మేము అరండలుపేట వదలి, బ్రాడీపేటలోని గడియారమువారియింటఁ బ్రవేశించితిమి.

గత సంవత్సరమునవలెనే యీ యేటఁగూడ గుంటూరిలో బొబ్బలరోగము వ్యాపించెను. ప్రాఁతగుంటూరు, అగ్రహారము, అరండలుపేటలలో క్రమక్రమమున నీవ్యాధి యల్లుకొనియెను. కావున మేము స్థలము మార్చుట శ్రేయస్కర మయ్యెను. 6 వ తేదీని ప్రహరీగోడ పునాదు లారంభించితిమి. అపుడె మా బావమఱఁది పంపిన యంటుమామిడి మొలకలు పెరటిలో పాతించితిమి.

బ్రాహ్మమతప్రచారముకొఱకై గుంటూరి కేతెంచినమిత్రులు పాలావజ్ఘల లక్ష్మీనారాయణగారు, నాబాల్యస్నేహితుఁడగు కొండయ్యశాస్త్రి మూఁడునెలలక్రింద చనిపోయెనను వార్త చెప్పి నా కమిత విషాదమును గలిపించిరి. పిఠాపురము దివానుగారగు మొక్కపాటి సుబ్బారాయఁడుగారు దివంగతులయిరని 25 వ తేదీని నాకుఁ దెలిసెను. నాకు వీరితో నంతగఁ బరిచయము లేకుండినను, వీరు ఉదారస్వభావులనిమాత్రము తెలియును. చిలుకూరి వీరభద్రరావు గారి "ఆంధ్రులచరిత్ర" ప్రకటనమునకు సహాయము చేయుఁడని నేను గోరఁగా, వెనువెంటనే యొక నూఱురూపాయిలు వీరు వీరభద్రరావుగారి కంపిరి. ఆకాలముననే వీరభద్రరావుగారిని బెజవాడయందలి యొక లక్షాధికారియొద్దకు నేను గొనిపోఁగా ఒకరూకయైనను ఆయన వలన లభింపదయ్యెను ! కొలఁదికాలములోనె యాలక్షాధికారి మృతి నందెను. ఆయన ధనరాసులు భస్మహవ్యము లయిపోయెను ! ఆహా ! తమ యసువులు నైశ్వర్యములును ప్రపంచమున స్థిరసంస్థలని మురిసి మనుజు లెట్లు మోసపోవుచున్నారు !