పుట:2015.373190.Athma-Charitramu.pdf/552

ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 510

యిపుడు నిర్ణీత మయ్యెను. కళాశాలలో నన్నాంగ్ల శాఖకు ముఖ్యోపన్యాసకునిగను, నా బదిలీదారగు సత్యనారాయణమూర్తిగారిని తర్కశాస్త్రోపన్యాసకునిగను జేసిరి.

1915 వ సంవత్సరము తుదిభాగమున మేము క్రొత్తపేట వదలి, ఆరండలుపేటలో న్యాపతి హనుమంతరావుగారి చిన్న యింటఁ బ్రవేశించితిమి. ఈ పేటలోని యిండ్లు విశాలస్థలములందు దూర దూరముగఁ గట్టఁబడుటచేత మిగుల వాసయోగ్యముగ నుండెను. హనుమంతురావుగారు నాకుఁ జిరపరిచితులగు సాధుపురుషులు. వారి యింటి దాపుననే కొండ వెంకటప్పయ్యగారు బస చేసియుండిరి. చాల కాలమునుండి నాకు వీరును స్నేహితులె. మేము మువ్వురము తఱచుగఁ గలసికొని మాటాడుకొనుచుండువారము. 1913 వ సంవత్సరమునుండియు వెంకటప్పయ్యగారు చాల రాబడి గల తమ న్యాయవాదివృత్తిని వదలివైచి, దేశసేవాపరాయణు లయిరి. హనుమంతరావుగారు న్యాయవాది యుద్యోగము విరమింపకున్నను, దేశహితైక కార్యనిమగ్నులైయుండిరి. వారిపుడు గుంటూరు పురపాలక సంఘాధ్యక్షులుగ నుండి, తమవృత్తియందుకంటె పరోపకారకార్యములందె యెక్కువ శ్రద్ధ వహించియుండిరి.

స్త్రీవిద్యాభివృద్ధికై ప్రత్యేకపాఠశాల యొకటి, నెలకొల్ప వలెనని కొంతకాలమునుండి వెంకటప్పయ్యగారు మిత్రులు నేనును ఆలోచించుచుంటిమి. కొన్ని వత్సరములక్రిందటనే రోమనుకెతోలికు మతసంఘమువారు వేటపాలెము విడువనెంచి, అందలి తమతోఁటయు భవనములను అమ్మఁజూపఁగా, వెంకటప్పయ్యగా రవి చౌకగాఁ గొనిరి. ఇపుడీవేటపాలెపుతోఁటలో "శారదా నికేతనము" అను పేరుతో మహిళావిద్యాలయ మొకటి స్థాపింప పంతులుగా రుద్య