పుట:2015.373190.Athma-Charitramu.pdf/53

ఈ పుట ఆమోదించబడ్డది

4. రేలంగి 15

మా పెత్తండ్రులలో జ్యేష్ఠులగు గంగన్న గారితో పాఠకుల కిదివఱకే కొంత పరిచితి కలిగినది. ఆయన లౌక్యవ్యాపారములందును ముఖ్యముగ న్యాయసభలందలి వ్యాజ్యెములందును, ఎంతయో యభిరుచి గలిగి, వానియం దమితానుభవము నలవఱుచుకొని యుండెను. ఆప్రాంతమందలి మొఖాసాదారులగు క్షత్రియప్రముఖు లాయన యనుచరులు. ఆయన మంచి ధనార్జనపరుఁడు వెంకటరత్నముగారు గోటేరు మున్నగు గ్రామములందు రాజులపక్షమున కరణీకము చేయుచువచ్చెను గాని, ఆయన యభిమానవిద్య యాంధ్రసాహిత్యము. పద్మరాజుగారు చిరకాలము ఉపాధ్యాయుఁ డై యుండినను, ధన సంపాదనమున తన రెండవయన్నవలెనే కొంత వెనుకఁబడి, ఆయన వలెనే సాహిత్యవిషయములం దభిరుచి గలిగి యుండెను. మా తండ్రి పెద్దయన్నకుఁ గల లౌకిక కార్యదక్షతకును, ద్వితీయ తృతీయసోదరుల సాహితీపాండిత్యమునకును నోఁచుకొనక, బాల్యముననే సర్వేశాఖలో నుద్యోగము సంపాదించి, మధ్యమధ్య పని విరమించుకొని యిలు సేరుచుండినను, ఆశాఖలోనే మరలమరల నుద్యోగము చేయుచువచ్చెను. ఇట్లు వివిధమండలములం దాయన సంచారము చేసి సంపాదించిన సొమ్మును సమష్టికుటుంబ పోషణమునకై పెద్దయన్నకుఁ బంపించుచు వచ్చెను. గంగన్నగా రాద్రవ్యమును జాగ్రతపఱచుచు తణుకు తాలూకాలోని కొన్ని గ్రామములలో మంచిభూములు కుటుంబోపయోగార్థమై కొనఁగలిగిరి.

నా పదియవ సంవత్సరమున నేను రేలంగిలోని పాఠశాలలో నాంగ్లేయభాషాభ్యాస మారంభించితి నని జ్ఞప్తి. మా ప్రథానోపాధ్యాయుఁడు చామర్తి అన్నమరాజుగారు. ఆయన ప్రవేశపరీక్షవఱకును జదివినవారు. వేలుపూరులో నివాసమేర్పఱచుకొని, అనుదినమును