పుట:2015.373190.Athma-Charitramu.pdf/46

ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము

వీథిని మఱింత స్ఫుటముగ గోచరించుచున్నవి. మొదట నే నందు పల్లెబడులలో గాలము గడిపి, పిమ్మట పాఠశాలఁ బ్రవేశించితిని. మూఁడవపాఠపుస్తకము మరల నా కరము లలంకరించెను. నా కిచటఁ గొందఱు బాలురు నెచ్చెలు లైరి. గోదావరీనదీగర్భమందలి రెల్లు దుబ్బులు నిసుకతిన్నెలును మిత్రులతోఁ జుట్టివచ్చుచును, వరదకాలమున నొడ్డువఱకును వ్యాపించిన యేటి పోటుపాటులను దమకమునఁ గనుగొంచును, నేను బ్రొద్దు పుచ్చుచుండువాఁడను. ఆ సంవత్సరమున వరదలు మిక్కుటముగ నుండెను. మేము నివసించెడి యింటి చుట్టు గోడదగ్గఱ పోఁతగట్టు నానుకొనియె దినములకొలఁది గౌతమీనది భయంకరాకారమునఁ బ్రవహించుచుండెను. ఏటఁ గొట్టుకొనివచ్చిన యొకమొసలి యా గ్రామమున కనతిదూరమున నివాస మేర్పఱచుకొని, నీళ్లు చొచ్చిన మేఁకలను దూడలను వేఁటాడుచుండెను. ఒక యడవి పందిని అప్పుడే తెగటార్చిన యచ్చటి రాజకుమారుఁడు, ఒక నాఁడా మకరిని బట్టి వధించి తెచ్చెను. అంత దానిపొట్టఁ గోసి చూడఁగా, ఉంగరములు, బంగారుపోగులు నందు గాననయ్యెను అవి, రెండు రోజులక్రిందటనే ప్రమాదవశమున దానినోటఁ బడిన పసులకాపరి యగు నొక యర్భకునివి ! పుత్రశోకార్త యైన వానితల్లి యవి చూచి గోలుగోలున నేడ్చెను.

ఏడవయేటనుండియే నాకు నెచ్చెలుల సావాసము మరగి నునుట యలవా టయ్యెను. నాయీడు బాలురు మా యింట నెవరును లేరు. నా రెండవతమ్ముఁడు వట్టిశిశువు. పెద్దవాఁడగు వెంకటరామయ్య మూఁడేండ్లు వయస్సు కలవాఁడు. ఐనను, వచ్చియురాని మాటలతో నుండి, తప్పుటడుగులు వేయుచుండెడి యా పసివానికిని, సతతము స్నేహితులతోడి సుఖసంభాషణములకుఁ జెవి కోసికొనుచు, ఇంటఁ