పుట:2015.373190.Athma-Charitramu.pdf/402

ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 364

ఖండించి వైచిరి. నేను గొంచెము మాటాడితిని. సంస్కరణమునకు సుముఖుఁడగు నగ్రాసనాధిపతి, మెల్లఁగను క్రమక్రమముగను సంఘ సంస్కరణము దేశమున నల్లుకొనవలె నని చెప్పిరి.

24 వ తేదీ దినచర్యలో నే నిట్లు లిఖించితిని : -

"స్వార్థపరుని సంకుచిత స్వభావము, వాని ప్రతి పనియందును, పలుకునందును ప్రతిబింబిత మగుచుండును ! * * * నా కిపుడు కావలసినది, భాగ్యము కాదు, ఆరోగ్యము కాదు, తుదకు మనశ్శాంతి యైననుగాదు. ఇంద్రియ నిగ్రహ మొకటియే కావలయును ! దైవమా ! నాకి ది యేల ప్రసాదింపవు?"

14 వ సెప్టెంబరు దినచర్య యిటు లుండెను : - "నేఁడు భార్య, యిరువదిరూపాయిల కొక పట్టుచీర కొనుక్కొనెను. నేను గట్టిగ చీవాట్లు పెట్టఁగ విలపించెను. తుదకుఁ గావలసిన సొమ్ము కొంత నేనీయఁగా సుముఖియై సంతోషించెను. ధనమహిమ మిట్టిది గదా!"

ఇప్పుడు పఠనాలయమున జరుగుచుండెడి మా ప్రార్థనసమాజసభలకు పెక్కండ్రు విద్యార్థులు వచ్చుచుండువారు. ప్రతివారము నేదో విషయమునుగూర్చి నేను ఉపన్యాస మిచ్చుచుంటిని. ఆదివారప్రార్థన సభలేకాక బుధవార సంభాషణ సమావేశములుకూడ నేర్పఱిచితిమి. 20 వ సెప్టెంబరు బుధవారమున మొదటి ప్రసంగసభలో, "విగ్రహారాధనము" ను గుఱించి చర్చ రెండుగంటలవఱకును జరిగెను. విద్యార్థులలో పలువురు చర్చలో పాల్గొనిరి. కొందఱిమాటలలో, తెలివికంటె టక్కఱితనమే ప్రబలియుండినను మొత్తముమీఁద చర్చ సంతోషదాయకముగ నుండెను.