పుట:2015.373190.Athma-Charitramu.pdf/383

ఈ పుట ఆమోదించబడ్డది

30. జనకసంస్మరణము 345

యుండువారము. రాత్రులు నిద్రను నిరోధించితిమి. అట్లుగాక, ఒకరి వెనుక నొకరము మేము మాతండ్రిని గాచుచు,. నిదురించుచుండుట మంచి దని బంధువులు యోజన చెప్పిరి. కాని, వంతులచొప్పున వేచి యుండుట యనునది, వంతులచొప్పున ప్రేమించుటవలె మాకుఁ దోఁచెను ! ఒక్కొక్కప్పుడు మాలో నెవరముగాని నిద్రాపారవశ్యమున నైనను, ఒండొరుల బోధనముననైనను, ఒకింత కునికినప్పుడు, తండ్రి మూలుగు చెవులఁబడగనే అదరిపడి లేచి కూర్చుండువారము ! ఇట్లు మేము చనిపోవుతండ్రిని మిగుల శ్రద్ధతోఁ గనిపెట్టితిమి. ప్రేమ పూరితహృదయు లగు పుత్రులు తనకు సపర్యలు చేయుచుండిరని గాంచి సంతృప్తి నొందుటకైన మాతండ్రి కొకింత స్పృహ వచ్చి ప్రాణము నిలుచునేమో యని మే మాశించుచుంటిమి. కాని, యీశ్వరోద్దేశము వేరయ్యెను.

"మా కత్యంతప్రేమాస్పదుఁడగు పితృని కళేబరము ఛితిపై నొక త్రుటిలో మటుమాయమయ్యెను. మృత్యుదేవతా ! మా జనకుని యసువులఁ గొనిపోయిన నీవు, విచ్చల విడిగ సంచారముచేసెడి నా విషయేచ్ఛల నేల సమయింపఁజాలవు? కొంతకాలముక్రిందట పాపచింతనలు నామనసునఁ జెలరేగి యుండునపుడు, ఒకచిన్న తమ్ముని మరణ రూపమున భగవంతుఁడు నాకు హృదయప్రబోధముఁ గలిగింపఁజూచెను. మరల నిటీవల నా యంతరంగము హేయవాంఛలకును పాపసంకల్పములకును నాటపట్టయ్యెను. నా మదోన్మత్తత నడగించుటకు నాకేదో మూఁడునని యెదురు చూచుచుంటిని. ఇవ్విధముగఁగాని నాకుఁ బ్రాయశ్చిత్తము గలుగదని యెంచి భగవంతుఁడు నా కీవిపత్సందేశము నం పెనని నే నెంచుచున్నాఁడను.