పుట:2015.373190.Athma-Charitramu.pdf/326

ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 286

మధ్యమున నేలూరులో వీరభద్రరావు, కామేశ్వరరావుగార్లు మమ్ముఁ గలసికొనిరి. సాయంకాలము పురమందిరమునకుఁ బోయి చూచుసరికి మఱునాఁడు ప్రొద్దున బీదలకు నన్నదానము చేయు నేర్పాటులు, గావించుచు, శ్రమపడుచుండెడి పావనమూర్తియగు పాపయ్యగారు కానఁబడిరి.

16 వ ఏప్రిలు తేదీని వీరేశలింగముగారు ప్రార్థనసమాజమున ప్రారంభోపన్యాసము గావించిరి. మధ్యాహ్నము పాపయ్యగారి యన్నదానమును, సాయంసమయమున నరసింహరాయఁడుగారి ధర్మోపన్యాసమును జరిగెను. నేను కొన్ని ప్రార్థనలు గావించితిని. మిత్రులు వెంకటరత్నము నాయఁడు రామమూర్తిగార్లు బందరునుండి వచ్చిరి. మఱునాఁటియుదయమున నాయఁడుగారు "తమసోమా జ్యోతిర్గమయ!" అను వాక్యముతో నారంభించి, ధర్మోపన్యాస మొసంగిరి. సాయంకాలమున వీరేశలింగముగారు తాము నూతనముగ నిర్మించిన "ప్రార్థన మందిరము"నుఁ దెఱచిరి. వెంకటరత్నమునాయఁడుగారు తమకు పంతులుగారిదెసఁ గల యసమాన భక్తివిశ్వాసముల నాసమయమున వెలిపుచ్చిరి. మఱునాఁడు సమాజసభ్యుల ఛాయాపటము తీయఁబడెను. మధ్యాహ్నము కూడిన ఆస్తికసభాసమావేశమునందు, ఏతత్సభా నిధికై 500 రూప్యములు విరాళ మొసఁగెదమని మిత్రులు వాగ్దానము చేసిరి. నేను సంవత్సరమునకు డెబ్బదియైదు రూపాయ లీయ నిశ్చయించితిని.

సత్యసంవర్థనిలోఁ బ్రరించుటకై "ప్రత్యక్షభగవత్సందర్శనము" అను శీర్షికతో నొక యాంగ్ల వ్యాసము వ్రాసి, అది వీరేశలింగముగారికి నే నిపు డిచ్చితిని. అది 1897 మార్చి "సత్యసంవర్థని"లోఁ బ్రచురింపఁబడెను. అందలి ముఖ్యాంశము లిటఁ బొందు