పుట:2015.373190.Athma-Charitramu.pdf/279

ఈ పుట ఆమోదించబడ్డది

8. యం. యే. పరీక్ష 241

భించి సత్ఫలముల నొసంగఁగలవు. కావున ప్రార్థనసమాజ మిట స్థాపించి, నా విద్యార్థిస్నేహితుల నందుఁ జేర్పింప నే నుద్యమించితిని. ఒకనాఁడు సంభాషణసందర్భమున అనంతముగారితో నే నీసంగతి ప్రస్తావింపఁగా, వారు క్రైస్తవమతవిశ్వాసకు లయ్యును ప్రార్థనసమాజస్థాపనము విద్యార్థుల నైతికాభివృద్ధికి లాభకరమని యొప్పుకొని, నాకుఁ బ్రోత్సాహముఁ గలిగించిరి. క్రైస్తవమతస్థుల కన్యమతప్రచార మంతరంగమున నసమ్మత మని నామిత్రులును, పాఠశాలలో నాంధ్రోపాధ్యాయులునునగు జానపాటి కామశాస్త్రులుగారు సదా హెచ్చరించుచుండినను, ప్రార్థనసమాజాదర్శములు మొత్తము మీఁద క్రైస్తవుల కిష్టములే యనియును, మాపాఠశాలాధికారులగు క్రైస్తవసంఘమువారు నాయెడ సానుభూతిఁ జూపుదురనియును దలంచి, నే నీకార్యమునకుఁ గడంగితిని. 25 వ ఆగష్టు శనివారమునాఁడు ప్రార్థనసమాజస్థాపనము జరుగునని పాఠశాలలోని పైతరగతులలో నేను బ్రకటించితిని.

కాని, ఆరోజున "హిందూబాలసమాజము" నెలకొల్పఁ బడునని నేనొక ప్రకటనము చూచితిని. కాన నాఁడు ప్రార్థనసభ జరుగుటకు వలనుపడ దనియు, ప్రార్థనసమాజస్థాపన మొకవేళ నా యుద్యోగమునకే భంగకరముగఁ బరిణమింపవచ్చు ననియును నేను దలంచి, "సంఘపారిశుద్ధ్య సమాజము"ను నెలకొల్పినచో, నే నెవరియీర్ష్యకును లోనుగాక విద్యార్థిలోకమునకు మే లొనరింపఁగలనని యెంచితిని. "హిందూబాలసమాజము" విద్యార్థుల నీతిపోషణమునకు సహకారి కాక, విగ్రహారాధనాది మూఢవిశ్వాసములకుఁ బ్రోత్సాహకరముగ మాత్రముండునని నమ్మి, ఆసమాజమునఁ జేరవలదని నావిద్యార్థులకు బోధించు చుండువాఁడను.