పుట:2015.373190.Athma-Charitramu.pdf/181

ఈ పుట ఆమోదించబడ్డది

32. పత్రికాస్థాపనము 143

యెవరైనఁ జెప్పిన, అందునకు రోషపడియెదరు. అట్లుండ, ఆలోపముల నివారించుటకు వారి కెట్లు ఊహ పుట్టును ? ఎట్లు సాధ్యమగును ? పరితపించువా డన్ననో, తన కీదుర్గణశేషము లున్నవని గ్రహించి, వానిని విడనాడుటకు సర్వదా ప్రయత్నము చేయుచుండును. తన కీసుగుణములు పూర్ణముగా లేవని, సచ్చారిత్రుల నడవడి ననుసరించి, సకలకల్యాణగుణపరిపూర్ణుఁడగు ఈశ్వరుని జేర యత్నముఁ జేయుచుండును."

పుణ్యపాపమార్గములు : - "మొదటిదారి పాపమార్గము. లోకమందు పాప మాచరించుట బహుసులభము. దానివలన మొట్టమొదట ననేకఫలములు గనుపించును. శరీరాయాస మక్కఱలేకయే ప్రతిమనుజుఁడును పాపాయుధమువలన తాను వలయువస్తువు సాధింపవచ్చును. అయిన నెంతకాలము సాధింపఁగలడు ? 'కలకాలపుదొంగ దొరకఁగలఁ డొకవేళన్‌' అనునట్లు వానిపాపములే వానికాళ్లకు బంధములై తగులుకొన సర్వవిధముల చెడి, యజ్ఞానాంధకారమగ్నుఁడై, తుద కెన్నరానిదురవస్థల కిల్లగు నరకగృహప్రవేశంబు చేయును."

సత్యసంవర్ధనీపత్రిక నే నిట్లు ప్రారంభించి, నెలనెలయును బ్రచురించితిని. ప్రథమోత్సాహమున సభ్యులలోఁ బలువురు పత్రికకు వ్రాసెద మని చేసిన వాగ్దానమును చెల్లింపలేకపోయిరి. ఏవియో కొన్ని పంక్తులు గీకి, అవి ప్రచురింపుఁ డని కొందఱు కోరుచుండిరి. ప్రతినెలయును కార్యనిర్వాహకవర్గము కూడి, పత్రికలో ముద్రింప వలసిన వ్యాసములు నిర్ణ యింపవలయును. అధికముగ నిట్టివ్రాఁతలు రాకుండుటవలన నుండువానిలో నేవియో కొన్ని వారు పత్రికలో వేయ నిశ్చయించుచుండువారు. రానురాను, సభ్యులు సమావేశ మగు