పుట:2015.373190.Athma-Charitramu.pdf/17

ఈ పుట ఆమోదించబడ్డది

లందు సుప్రతిష్ఠితములైన గుణశీలములు కాలక్రమమున పల్లవించి పుష్పించి ఫలించుచున్నవి. బాల్యమునందలి యభ్యాసములు సామాన్యముగ జీవితయాత్రను నిరూపించుచుండును. కోమలహృదయములందు ముద్రితములైన గుణశీలములు జీవయాత్రను ఫలప్రదముచేయగల విధము నాత్మచరిత్రము వివిధ సందర్భములందు ప్రత్యక్షము చేయుచున్నది. గృహరంగములందు బాల్యదశ యందు తల్లికిని సోదరీసోదరులకును బంధుమిత్రాదులకును పరిచర్యలు చేయగల స్వభావము పరోపకారశీలమునకు సాధనం బగుచున్నది. వేంకటశివుడుగారు తల్లికి గృహ కృత్యములందును సోదరీసోదరుల కవసరసమయములందును చేసిన పరిచర్యలు వారి స్వయంసహాయస్వభావమునకును, పరహితపరాయణత్వశీలమునకును, ఆత్మవిశ్వాసమునకును నిదర్శనములు. కుటుంబమునకు సంప్రాప్తమైన సుఖదు:ఖము లానందవిషాదములకు మూలములై, ఆత్మోద్ధరణమునకు వినియోగపడగలవిధము నాత్మచరిత్రము విశదము చేయుచున్నది. గృహరంగములం దభ్యస్తములైన గుణావగుణములు, రాగద్వేషములు, భయభక్తులు, సాంఖ్యయోగములును, విద్యారంగమునందును, విశ్వరంగమునందును పరిపక్వములై జీవయాత్రయందు పరిస్ఫుటము లగుచున్నవి.