పుట:2015.373190.Athma-Charitramu.pdf/139

ఈ పుట ఆమోదించబడ్డది

25. ఏకాంతజీవితము 101

మే మంత చొరఁబడితిమి. కొంత నడచునప్పటికి, నీటి లోతు హెచ్చి, నేను మాచిన్నితమ్మునిచేయి యట్టె వదలివేసితిని ! వెంకటరామయ్యమాత్రము పిల్లవాని చేతిపట్టు విడువలేదు. అంత మేము మువ్వురము వెనుక మొగము పట్టి, మాకుఁ దోడ్పుడుఁ డని మరల నా మనుష్యులను వేడితిమి. వారిలో నొకఁ డంత నీదుకొని వచ్చి, ఒక్కొక్కరినే మమ్మావలియొడ్డు చేర్చెను. పిల్లవానిని నిష్కారణముగఁ జంపివేసియుందు రని యచటివారు మమ్ము నిందించిరి. మా మేనమామలయిల్లు చేరి, బందుగులకు మా ప్రయాణవృత్తాంత మెఱిఁగించితిమి. నాఁడా గ్రామమందలి బాలికలు బొమ్మలపెండిండ్లు చేసికొనుచుండిరి. వారిలో నాభార్యయు, నా పెద్దచెల్లెలు నుండిరి.

మఱునాఁడే మేము రాజమంద్రి పయన మయితిమి. వాయు వతితీవ్రముగ వీచుచుండెను. ఒక్కొకప్పుడు గాలి తాఁకునకు నెత్తి మూటలతో మేము తూలిపోవుచుంటిమి. ఎటులో విజయేశ్వరముఁ జేరితిమి. ఆనాఁడు స్టీమరు రా దని తెలిసెను. ఆపెనుగాలిలో పడవ లేవియు నీటిమీఁదిపయనమునకు సాహసింపలేదు. ఇంతలో వాడపల్లిరేవున నొక రహదారీపడవ మునిఁగె ననియు, కొందఱుప్రయాణికులు చనిపోయి రనియు, మాకు వినవచ్చెను. మేము వాడపల్లికి నడచి పోయితిమి. మునిఁగిపోయినపడవ యొడ్డున కొకింత దూరమునఁదేలు చుండెను. చనిపోయినవారినిగూర్చి యేమియుఁ దెలియదు. రాజమంద్రినుండి యంత నొకస్టీమరు వచ్చి యెంత ప్రయత్నించియును, బోరగిలినపడవను తిరుగఁదీయ లేకపోయెను. ఇపుడు చీఁకటి పడుచుండుట చేత, రాత్రిభోజనమునకు మేము వెనుకకుఁ బోయి, విజయేశ్వరము సత్రమున బస చేసితిమి.