పుట:2015.373190.Athma-Charitramu.pdf/114

ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 76

పఠితలకు ముత్తుస్వామిశాస్త్రి పరిచయ మిదివఱకే కలిగినది. ఇతఁడు మాయందఱివలెనే మతవిషయములందు పెక్కు మార్పులు చెందినను, వానిని వెనువెంటనే లోకమునకుఁ బ్రచురింప వేగిరపడు చుండుటవలన,నిలుకడ లేనివాఁడని పేరుపడెను. ఐనను, అప్పటి కప్పుడే యుద్యోగి గృహస్థుఁడు నైన సంస్కారప్రియుఁ డగుటంజేసి, ఈతఁడు వయోవిద్యాదులందు వెనుకఁబడియుండు మాయందఱకు నాదర్శప్రాయుఁడగు నాయకుఁడు గాకున్నను, అనుభవజ్ఞుఁడును ఆలోచనాపరుఁడునునగు సహాయకుఁ డయ్యెను. వట్టి విద్యార్థుల మగు మాకు సంస్కరణమహావిషయములందు దోఁపని యాలోచనలు చెప్పుచు, మాభావములకు దోహదములు గలిపించుటయం దాతఁడు చక్కని నైపుణ్యమును జూపుచుండువాఁడు.

ఇట్టి సంఘసంస్కారప్రియు లందఱికి నేకీభావము నొడఁగూర్చి, వారలను కార్యరంగమునకు దింపఁగల సాధనమునకై మే మిన్నాళ్లును యోజించితిమి. తుట్టతుదకు, సంఘసంస్కరణ సమాజ స్థాపనార్థమై 15 వ మార్చి తేదీని మేము సభ చేసితిమి. నూతన సమాజోద్దేశములనుగుఱించి ప్రసంగించుచు నేను, "తమ హృదయము లందు మతాభినివేశమును, ప్రజాక్షేమాభిలాషయుఁ గలిగి, స్వార్థ త్యాగమున కాయత్తు లగువారలే యీ సమాజసభ్యత్వమున కర్హు"లని యుద్రేకమునఁ బలికినపుడు, మొదటనే యిట్టి తీవ్రనియమాచరణమున కెవరును సమకట్ట రని కొందఱు చెప్పివేసిరి. ఎట్టకేలకు సంఘసంస్కరణసమాజము స్థాపిత మయ్యెను.

ఆనెల 21 వ తేది సంవత్సరాదిపండుగనాఁడు. ఏతత్సమాజ విధుల నేర్పఱుచుటకు బాలికాపాఠశాలలో సభ కూడెను. ముత్తుస్వామిశాస్త్రి అగ్రాసనాధిపుఁడు. "సంఘసంస్కరణసమాజ మను పెద్ద