పుట:2015.372412.Taataa-Charitramu.pdf/34

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రపంచమున సమృద్ధియగు ప్రత్తిపంటకు తగుభూసారము వేడిమి గలదేశములు మూడే:- అమెరికాలోని సంయుక్తరాజ్యము, ఆఫ్రికాలోని యీజిప్టు, మనభారతదేశము. వీనిలో అమెరికా ప్రత్తి సన్ననూలుకు ప్రశస్తము; దాని నింగ్లండుకు తెచ్చుటయు సుకరము. ఈజిప్టులో నైలునదీప్రాంతమున ప్రత్తి వ్యవసాయము నిటీవలనే యారంభించిరి. అంతకుపూర్వ మచ్చట మంచి ప్రత్తిపంటలేదు.

ఇట్లుండగా, అమెరికాలో సంయుక్త రాజ్యపు ఉత్తరదక్షిణభాగములమధ్య కలహము గల్గెను. దక్షిణభాగమే చాల సారవంతము; అందు ప్రత్తి బాగుగపండును. అచ్చటి తెల్లవారు కొలదిమంది యైనను, నీగ్రోబానిసల కూలిమూలమున వారు చాల పంటలబండించి భాగ్యవంతులైరి. వారు నీగ్రోలను మన మాలలకన్నను హీనులుగ జూచుచుండిరి. ఉత్తరప్రాంతపు వారా రాజ్యమంతటను నీగ్రోల యమానుష దాస్యము నెట్లైన పరిహరింప జూచిరి. ఇది దక్షిణప్రాంతపుధనాఢ్యులగు దొరలకు నష్టకరమైనందున, వా రంగీకరింపక, ఉత్తరప్రాంతీయులపై తిరుగబడి, తాము ప్రత్యేకరాజ్యముగ విడిపోవయత్నించిరి. 1861 లో, అమెరికాలో నిట్లంతర్యుద్ధ మారంభెంచెను. *


  • [1]ఉత్తర జిల్లాల వారు నౌకాబలముకలవారై, దక్షిణజిల్లాల రేవులన్నిటిని ముట్టడించి, అచ్చటి కోస్తా వ్యాపారము నరికట్టిరి. సంయుక్త
  • * ఇది American Civil War అను పేర చరిత్రలో ప్రసిద్ధము (1861 - 1865.)