పుట:2015.372412.Taataa-Charitramu.pdf/178

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యకులగూడ నాశ్చర్యచకితులగావించినది. ఏయేపరిశ్రమల స్థాపించిన తనకును దేశముకునుగూడ లాభముకల్గునో, వాని నేప్రదేశమున స్థాపించుట యుచితముగ నుండునో, వానిని నవీనపద్ధతులలో నెట్లు నడుపవచ్చునో, వానిపరికరములను వివరములను ఎట్లు సిద్ధపర్చి యుపయోగించుకొనవలెనో, గమనించి గ్రహించుటలో ఆయనకుండిన చాతుర్యము, దూరదృష్టి, అద్భుతములు. ఆప్రతిభ ఆయననిరంతరకృషిచేతను, తదేకదీక్ష చేతను, ఇంకను వర్ధిల్లెను.

ఆయనప్రపంచజ్ఞానము, మానవతత్వపరిజ్ఞానము, అసమానములు. ఆయన యూరపుకు అమెరికాకు జపానుకు అవసరమైనప్పుడెల్ల స్వయముగ వెళ్ళుచుండెను; అది వ్యారవృద్ధికి చాలతోడ్పడెను. వివిధదేశములందు సంచరించుట ఆయనకు చాలప్రీతిగ నుండెను. కాని తనజ్ఞానమును లోకానుభవమును వృద్ధిజేసికొనుటకే దేశాటనమును ఆయన పూర్తిగ వినియోగించుకొనెను. మనదేశమందును విదేశములందును సంచరించునప్పుడు, ఆయాప్రాంతముల జనుల వివిధపరిశ్రమలను వారియాచారములను, గృహనిర్మాణాదులను, వ్యవసాయాది పద్ధతులను, అచటి వస్తుసముదాయమునుగూడ, జాగ్రత్తతో గమనించి, ఆయనుభవముతో తనవస్తునిర్మాణపద్ధతులను జనుల కనుకూల మగునట్లు చేయుచుండెను. జనులకిష్టమగు వానినే తయారు చేయగల్గెను.