పుట:2015.372412.Taataa-Charitramu.pdf/169

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనబడు యంత్రవాస్తువిద్య గొప్పవిజ్ఞానముగ వృద్ధియైనది. అందువలన, అత్యద్భుతములగు మహాభవనములు గొప్ప ఆనకట్టలు వంతెనలు క్రేనులు మున్నగునవి నిర్మింపబడుచున్నవి. అట్టి ఉపయోగకరములగు గొప్పకట్టడములను వైజ్ఞానికముగ నిర్మించుటకు, వాస్తువిశారదులు సభ్యులు గాగల ఒకనిర్మాణసంఘమును తాతాకంపెనీవారు స్థాపించిరి. ఇదివరలో రైల్వేలబోలు పెద్దకంట్రాక్టులను పాశ్చాత్యులే తీసికొనుచుండిరి. అట్టివాని నిప్పుడీకంపెనీవారు తీసికొని, సులభముగ ప్రజ్ఞతో నిర్వహింప గల్గుచున్నారు. తాతాకంపెనీవారి వివిధ కార్యాలయముల నుంచుటకు మహాద్భుతమగు నొకే భవనము నీకంపెనీవారు నిర్మించిరి. (దీనికే నవసారి బిల్డింగ్సు అని పేరు.)

దొరాబ్జితాతాయు ఆయనమిత్రులును కలసి, రెండుకోట్ల రూపాయల మూలధనముతో, న్యూ ఇండియా అస్యురెంసు కంపెనీ' అనుపేర క్రొత్తరకపు భీమాకంపెనీని స్థాపించిరి. దీని నిలవద్రవ్యము మనదేశమున గొప్పపరిశ్రమల సంఘములకును బలీయమగు ధనసంస్థలకును ఈయబడి, భద్రముగ వృద్ధిచేయబడును. అందువలన ఆదేశీయపరిశ్రమలకు ద్రవ్యసహాయము కల్గును; ఆయిన్స్యురెంసు కంపెనీయు చిరస్థాయిగ నుండును. మరియు, ఇదివరలో మనదేశీయములగు కంపెనీలలో లేని ప్రశస్తమగు క్రొత్తరకపు భీమాలకును, ఇందు ఏర్పాటు కలదు. నరులకు ప్రమాదమరణము కలిగినచో హెచ్చుసొమ్ము