పుట:2015.372412.Taataa-Charitramu.pdf/144

ఈ పుట ఆమోదించబడ్డది

పనిచేయును. మిల్లుగొట్టములనుండి యిదివరలో నిరంతరము బొగ్గుపొగవచ్చి వాయుమండలము నావరించుచు, బొంబాయి నగరమున కనారోగ్యము కల్గించుచుండెను. నేలబొగ్గు వాడక విద్యుచ్ఛక్తినే వాడుచో, బొగ్గుపొగయుండదు. కనుక నచటిగాలియు శుభ్రమగును. మరియు ఈవర్ష జలమంతయు చెదిరి వ్యర్ధముగ సముద్రములో పడకుండ, దానిని కాలువలద్వారా వ్యవసాయాదులకు లాభకరముగ వినియోగింపవచ్చును.

ఈ సంగతులన్నిటిని గ్రహించి, వెంటనే తాతాగారు సమర్థులగు వాస్తువిజ్ఞులచే నాప్రణాళికను పూర్తిగా పరీక్షింప జేసిరి. ఆయుద్యమము సాధ్యమని, లాభకరమని, వారు తెల్పిరి. అంతట, స్వయముగ నింగ్లండుకుజని, అచటభారతమంత్రియగు హమిల్టను ప్రభువుతో, తాను తలపెట్టిన యుక్కు పరిశ్రమనుగూర్చియు, ఈజలవిద్యుచ్ఛక్తి కార్యమును గూర్చియు, తాతా చర్చించెను. సాధక బాధకములదెల్పి ఆయనసహాయమును గోరెను. హమిల్టనుప్రభువు తనసానుభూతిని తెల్పెను. అందువలన, తరువాత మనదేశమందలి ప్రభుత్వాధికారుల యాటంకమును, ప్రభుత్వపు పరిశోధనలలో తరుచుగ కలుగు విశేషకాలయాపనయు లేకుండ, కొంతసౌకర్యము కలిగినది.

ఈపరిశ్రమకై మైళ్ళకొలది కొండస్థలములను, అడవులను, కొలదిజనులుమాత్రము వసించు కొన్నిలోయలను, కొనవలసివచ్చెను. అందు కొన్నిప్రాంతములు వ్యక్తులవి. వానినికొనుటకు