పుట:2015.372412.Taataa-Charitramu.pdf/126

ఈ పుట ఆమోదించబడ్డది

చూడగనే వారి కపరిమితానందము కలిగెను. అది పాదాదిశిర:పర్యంతము లోహమయమే, ఎటుజూచినను అన్ని ప్రక్కలను పెద్ద ఇనుపపెళ్ళలు, ఆపెళ్ళలే కొన్నియేండ్ల పనికి చాలును. ఆవైపున నింకను నిట్టిగనులు కొండలు గలవు. లోగడజూచిన 'ధల్లి, రాజహర' గనులకన్న గూడ నివి చాల ప్రశస్తములు; వానికన్నను ఇవి బొగ్గుగనులకు సముద్రముకు దగ్గరవి. సమృద్ధిగ మంచి యినుము తయారైనచో, దాని నిటనుండి 150 మైళ్ళ లోపుననున్న కలకత్తారేవుద్వారా విదేశములకు గూడ నెగుమతి చేయవచ్చును. ఇట్టి సౌకర్యఘటనము దుర్లభము. ఇరువదిమైళ్ళ విశాలమగు యాగనుల ప్రాంతమంతను వెంటనే తాతాకంపెనీవారు మయూరభంజి సంస్థానముకు న్యాయమైన రాజాంశమిచ్చుపద్ధతిని, వసువుగారి ద్వారా ఆమహారాజుగారివద్ద కవులుకు తీసుకొనిరి.

ఈగనులను ఇంగ్లండు అమెరికాలోవలె పెద్దయెత్తున లాభకరముగ పనిచేయుటకు, చాల మూలధనము, గొప్ప నిపుణుల సహాయమును, కావలెను. అట్టిపరిశ్రమ లింతవరకు మనదేశమున లేవు. కావున దొరాబ్జితాతా 1906 లో లండనుకు వెళ్ళి, ఇంగ్లీషు పరిశ్రమల నాయకులను పెట్టుబడి పెట్టుడని కోరెను; అందుకు, వడ్డీయేగాక, వారికి పరిశ్రమలో వాటా గూడ నిచ్చెదననెను. కాని, అట్లును, అచట తగు ద్రవ్య సహాయము లేకపోయెను. ఇట్లు దొరాబ్జి నిరాశుడై, 1907 లో స్వదేశముకు తిరిగి వచ్చెను.