పుట:2015.372412.Taataa-Charitramu.pdf/123

ఈ పుట ఆమోదించబడ్డది

దొరాబ్జి, వెల్డుదొర, ఈముగ్గురును మధ్యదేశమున ఒరిస్సా ప్రాంతమున కొండలలోను అడవులలోను గనులకై తిరుగుచు, తీవ్రముగ పరిశోధన జేసిరి. అందుచాలచోట్ల రోడ్డు, సరియగు దారికూడ, లేకుండెను. కొన్ని ప్రదేశములందు త్రాగుటకు నీళ్ళే లేవు. పులులు మున్నగు భీకరమృగము లందందు తిరుగుచుండెను. రాత్రులం దొకప్పుడు కొండనేలను, ఒకప్పుడు తమ యెడ్లబండిలోనే, వారు నిద్రించుచుండిరి. ఇట్లు సంచరించుచు ఆయాప్రాంతముల భూతత్వమును శ్రద్ధతో బరీక్షించిరి.

చందాలో ఇనుము సున్నపురాళ్ళు నుండెను. కాని అప్పటికి 'వరోరా' గనిలోని బొగ్గు అడుగంటెను. అందుచే దగ్గరనున్న 'బెల్లారపు' బొగ్గుగనికై వారు దరఖాస్తుపెట్టిరి. ఆబొగ్గు ప్రభుత్వముకే యవసరమని, దాని కేవ్యక్తులకును లైసన్సు నీయవీలులేదని, ప్రభుత్వమువారు తెల్పిరి. ఆప్రాంతపు లోహమును ఒకేచోట సమృద్ధిగ లేదు. కనుక చందాజిల్లాలోని గనులను తుదకు వదలుకొనవలసివచ్చెను. ఈపరీక్షలన్నిటికై, అప్పటికి జంషెడ్జికి 5 లక్షల రూపాయలు వ్యయమయ్యెను.

అంత నాయంధకారబంధురస్థితిలో హఠాత్తుగ వారికొక జ్యోతి కనబడెను. 'ప్రమధనాధవసు' అను ప్రతిభాశాలియగు బెంగాలి భూతత్వజ్ఞుడు ప్రభుత్వోద్యోగవశమున అనేకప్రాంతముల భూమిస్వభావమును శ్రద్ధతో బరిశీలించి యుండెను.