పుట:2015.370800.Shatakasanputamu.pdf/91

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. భవదీయార్చన సేయుచోఁ బ్రథమపుష్పంబెన్న సత్యంబు రెం
     డవ పుష్పంబు దయాగుణంబును విశిష్టం బేకనిష్ఠాసమో
     త్సవసంపత్తి తృతీయ పుష్పమది భాస్వద్భక్తిసంయుక్తియో
     గవిధానం బవిలేని పూజలు మదిం గైకోవు సర్వేశ్వరా!95
మ. అమరేంద్రాద్రి శరాసనంబు హరి దివ్యాస్త్రంబు భూమండలం
     బమరంగా రథ మర్కచంద్రులు తదీయాంగంబులై యొప్పుఁ జి
     త్రము నీకుం బురలక్ష్య మేయునెడ నుద్యద్భాతి నత్యల్పకా
     ర్యములందైనను దా మహాఘనము నీ యత్నంబు సర్వేశ్వరా!96
మ. దివిజేంద్రత్వముఁ బద్మజత్వము జగత్సేవ్యస్థిరానర్గళో
     త్సవరూపంబగు కేశవత్వమును నీ సద్భక్తి సంవృద్ధిలో
     లవమాత్రస్థితు లెన్న భక్తిజనితోల్లాసావనోద్యత్సుఖా
     ర్జవసౌభాగ్యము మాన మెవ్వరికిఁ జెప్ప న్వచ్చు సర్వేశ్వరా!97
మ. పరమార్థంబుగ నా మనంబున భవద్భక్తిప్రభావంబు వి
     స్తరమై పుట్టదు పుట్టినం బ్రబల దంతం గొంత వర్ధిల్లెనే
     విరసంబై యటమీఁదఁ జిక్కువడుఁ భావింపంగ నెట్లన్న న
     స్థిరుఁడం గాన జడుండఁ గాన బకవేషిం గాన సర్వేశ్వరా!98