పుట:2015.370800.Shatakasanputamu.pdf/214

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     దావలఁమైనగాని గుఱి దప్పనివాఁడు తరించువాఁడయా
     తావకభక్తియోగమున దాశరథీ! కరుణాపయోనిధీ!94
చ. సరసుని మానసంబు సరసజ్ఞుఁడెఱుంగును ముష్కరాధముం
     డెఱిఁగి గ్రహించువాడె కొలనేక నివాసముఁగాగ దర్దురం
     బరయఁగ నేర్చునెట్లు వికచాబ్దమరంద రసైక సౌరభో
     త్కరము మిళిందమొందు క్రియ దాశరథీ! కరుణాపయోనిధీ!95
ఉ. నోఁచిన తల్లితండ్రికిఁ దనూభవుఁడొక్కడె చాలు మేటి చే
     చాఁచనివాఁడు వేఱొకఁడు చాచిన లేదనకిచ్చువాఁడు నో
     రాఁచి నిజంబకాని పలుకాడనివాఁడు రణంబులోన మేన్‌
     దాఁచనివాఁడు భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!96
ఉ. "శ్రీయుత జానకీరమణ చిన్మయరూప రమేశరామ నా
     రాయణ పాహిపాహి"యని బ్రస్తుతిఁ జేసితి నా మనంబునం
     బాయక కిల్బిష వ్రజ విపాటనమందఁగజేసి సత్కళా
     దాయి ఫలంబు నాకియవె దాశరథీ! కరుణాపయోనిధీ!97
ఉ. ఎంతటి పుణ్యమో శబరి యెంగిలిగొంటివి వింతగాదె నీ
     మంతనమెట్టిదో యుడుతమైని కరాగ్ర నఖాంకురంబులన్‌
     సంతసమందఁజేసితివి సత్కులజన్మమ దేమిలెక్క వే
     దాంతముగాదె నీ మహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!98
ఉ. బొంకనివాఁడె యోగ్యుఁ డరిబృందము లెత్తినచోటఁ జివ్వకుం
     జంకనివాఁడె జోదు రభసంబున నర్థికరంబు సాఁచినం