ఈ పుట ఆమోదించబడ్డది

విజ్ఞప్తి

శ్రీ ప్రభాకరశాస్త్రి గారి పీఠికలో నున్న క్రీడాభిరామము కావలె నని యనేకులు కోరుచుండుటచేతను, ద్వితీయ ముద్రణపుఁబ్రతు లచిరకాలముననే చెల్లి పోవుటచేతను మఱల నీగ్రంథమును కొన్నివిశేషాంకములను జేర్చి యిట్లు ప్రకటించితిమి.

శ్రీశాస్త్రిగారే యీ గ్రంథమును బునర్ముద్రణముఁ జేయింపవలయు ననుతలంపుతోఁ గొన్ని మార్పులను గూర్పులను గావించుకొనియుండిరి. వాని నట్లే కూర్చి వారి సూచనల ప్రకార మీగ్రంథముద్రణమును మేము కొనసాగించితిమి.

ఇందు ప్రకటించిన కాకతమ్మ చిత్రము వారి సేకరణమే. ‘కాకతి ‘ వ్యాసము వారు రచించినదే. ఇందలి యితర చిత్రములు తదుపరి మేము సేకరించినవి.

పండితులకుఁ పరిశోధకులకుఁ బరిశీలన కనువుగ నుండ వలె ననుతలఁపుతో నాకరముల నేర్చి కూర్చి సూచికలతో, శబ్ధానుక్రమణికలతో గ్రంథవిషయమును విశదపరిచితిమి.

ఇంకను విమర్శవిశారదు లీ క్రీడాభిరామముపై వెలయించిన, వెలయించుచున్న విమర్శలను దృష్టిలో నిడుకొని తగురీతి నిందు సమాధానములు పొందుపరచితిమి. విశేషించి వివరములతో పీఠికానుబంధములఁ జేర్చితిమి.

యథాపూర్వము ఆంధ్రమహాజనులయాదరణమున కిది పాత్రము కాఁగలదనియే విశ్వసించుచున్నాము.

__ప్రకాశకుఁడు.