ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

వల్లభాయిపటేల్

చేయవలసివచ్చినది. ఎక్కడఁ గాలుజారి తప్పుటడుగు వేయుదుమో, యందువల్ల దేశమున కేమి కీడుమూడునో యను భీతితో, బహుజాగరూకతతో, మన మిన్నాళ్ళుఁ గృషి చేయుచు వచ్చితిమి. ఈ గండములన్ని గడచి మనము బయట పడలేమని తలపోసినవారు, విశ్వసించినవారుకూడఁ బెక్కుమంది యున్నారు. ఒకవిధముగాఁ జెప్పవలయునన్న దేశవిభజనకు నేను చాల ననిష్టముగా నంగీకరించితిని. దుఃఖభారముతో నా హృదయము క్రుంగిపోయినది.

"అంతరాంతరములయందలి నా మనఃప్రవృత్తుల కది విరుద్ధము. మన జీవితలక్ష్యమునకు మన యాదర్శముల కిది పూర్తిగా విరుద్ధము. కాని మఱియొకవిధముగాఁ జూచిన నైచ్ఛికముగానే మనము దేశవిభజన కంగీకరించితిమి. దాని పరిణామము లెట్లుండగల వను విషయమును బూర్తిగాఁ దఱచి చూచిన పిమ్మటనే యంగీకరించితిమి. కలసి మెలసి నడువలేక పోయినప్పుడు విడిపోవుట మంచిదని మనము నిర్ణయించుకొన్నాము. ఇతర విధముల మనకు స్వాతంత్ర్యము లభించునదికాదు. దేశవిభజనకు మన మామోదించియుండకపోయినఁ బరిస్థితు లిప్పటికన్న నప్పు డెక్కువగా విషమించియుండును. ఆరోజులలో మనము పరస్పరము తగవులాడుకొనుచుఁ గాలము గడుపుచుంటిమి మన విషమపరిస్థితి నవకాశముగాఁ దీసికొని మూడవపక్షమువారు తమ పబ్బము గడుపుకొనుట మొదలు పెట్టిరి. అందువల్ల స్వాతంత్ర్యసిద్ధికి మనము మూల్యమును జెల్లించవలసి వచ్చినది. సాధ్యమైనంత త్వరలో విదేశీయులు వైదొలఁగినట్లయిన దానికి మూల్యముగా దేశవిభజన కంగీక