ఈ పుట ఆమోదించబడ్డది

వల్లభాయిపటేల్

37

చేయుభూములను గొట్టివేసిరి. ధనికులుకూడ జంకినప్పుడు, పోలీసువారిపేరుననే కొట్టివేసిరి. కొన్నిభూములను బఠానులనే ఖామందులునుగఁజేసిరి. ఘోరము! అతిఘోరము ! అధికారు లీ దారుణ చర్యల నవలంబించినది కేవలము సర్కారు సొమ్మును రాఁబట్టుకొనుటకుఁగాదు. రైతుల వెన్నెముకలను విఱుగఁగొట్టుటకుఁ, దమ ప్రతిష్ఠను నిలువబెట్టుకొనుటకు, తమ శాసనాధికారప్రాబల్యమును బ్రదర్శించుటకు, నెట్టి క్రూర కార్యములకైనను నొడంబడిరి. ఆనాడు బార్డోలీ రైతు లట్టి యపూర్వ త్యాగసాహసములను జూపుచుండినప్పుడు, సిమ్లా కొండలుకూడఁ గదలిపోయినవి. ఒక్క తాలూకాలో నే పది గ్రామములవారో యిట్టి వీర్యాతిరేకమును జూపఁగలిగినప్పు డిక దేశములోని రైతుజనమంతయుఁ దలఁచుకొనిన ప్రభుత్వము లేమి కావలయును? బ్రిటిషుప్రభుత్వ మట్టుడికిన ట్లుడికి పోయెను. ఈ వృత్తాంతములను బత్రికలలోఁగూడఁ బ్రచురింపనియ్యలేదు. మహాదేవదేశాయి రచించిన "బార్డోలీ కథ"ను గవర్నమెంటువారు నిషేధించిరి.

ఆనాఁ డే నాయకు లీ బార్డోలీ వీరులను నడిపిరో, వారే నేఁడు ప్రభుత్వాధికారులైరి. సర్దారు వల్లభాయి కాంగ్రెసు మంత్రులకు సారథి. ఆనాఁ డీ దారుణచర్యలను సహించలేక, డిప్యూటీ కలెక్టరు పదవిని వదలివేసిన దేశాయిగా రిప్పుడు బొంబాయి ప్రభుత్వమునందు రివిన్యూమంత్రి. వీరికర్తవ్య మేమి? కాంగ్రెసును నమ్ముకొని నిరాధారులైపోయిన యా బార్డోలీ వీరుల నజ్ఞాతవాసమునుండియైనను రప్పించి వారి భూములను వారి కిప్పించుట భావ్యముకాదా? సామాన్యముగ యుద్ధానంత