పుట:2015.329863.Vallabaipatel.pdf/104

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[13]

వల్లభాయిపటేల్

97

కర్మవీరుఁడు

కాంగ్రెసు మూల స్తంభములలో నాయన యొకఁడు. గాంధీజీతర్వాత కాంగ్రెసు విధాన నిర్ణేతలలో నగ్రస్థాన మాయనదే.

ఆయన పలుకే పెక్కుమందికి శాసనము. ఆయన యగ్నిగుండములో దూకుమన్నను వారు సంకోచించరు.

ఆయన యుపన్యసించిన నది సింహగర్జనమే. దేశభక్తుల నది యుత్సహింపఁ జేయును. విదేశీయ పరిపాలకుల నది కలవరపెట్టును.

సర్దార్‌వల్లభాయిపటేల్ నాయకత్వమున కింతటిప్రతిభ, యింతటి విశిష్టత యేవిధముగా వచ్చినవి ?

ఆయన నిష్కలంక దేశభక్తి యిందుకుఁ గారణమా? కాని దేశసేవానిరతిలో నాయనతో సమానులు కాఁగలవారు కూడ ననేకులు లేకపోలేదు.

కాగాఁ బాండిత్యములోఁ బ్రతిభలో ధీరశక్తిలో దూరదృష్టిలో నాయనతోఁ బోల్చదగినవారేమి, యాయన కంటె మిన్నలైనవారేమి, దేశములోఁ గొందరు లేకపోలేదు.