పుట:2015.328731.Neeti-Chendreka 0002.pdf/2

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

నవభాజనమున లగ్నం
బవు సంస్కారంబు వొలియ దటు గావున మా
ణవులకుఁ గథాచ్ఛలంబునఁ
జివి యుట్టఁగ నీతివచనసరణిఁ దెలిపెదన్.

కథాప్రారంభము

గంగాతీరమందు సకలసంపదలు గలిగి [1]పాటలిపుత్ర మను పట్టణము గలదు. ఆపట్టణము సుదర్శనుఁ డనురాజు పాలించుచుండెను. అతఁ డొకనాఁడు వినోదార్థము విద్వాంసులతో సల్లాపములు జరుపుచుండఁగా నొక బ్రాహ్మణుఁడు —

"పరువంబు కలిమి దొరతన
మరయమి యనునట్టివీనియం దొకఁ డొకఁడే
పొరయించు ననర్ధము నా
బరఁగినచో నాల్గుఁ జెప్పవలయునె చెపుమా.”
"పలుసందియములఁ దొలఁచును
వెలయించు నగోచరార్థవిజ్ఞానము లో
కుల కక్షి శాస్త్ర మయ్యది
యలవడ దెవ్వనికి వాఁడె యంధుఁడు జగతిన్. "

యని ప్రస్తావవశముగాఁ జదివెను. ఆపద్యములు రాజు విని చదువులేక మూర్ఖులయి సదా క్రీడాపరాయణులయి తిరుగుచున్నకొడుకులను దలంచుకొని యిట్లని చింతించె. “తల్లిదండ్రులు చెప్పినట్టు విని చదువుకొని లోకులచేత మంచివాఁ డనిపించంకున్నవాఁడు బిడ్డఁడుగాని తక్కినవాఁడు బిడ్డఁడా? మూర్ఖుఁడు ఎల్లకాలము తల్లిదండ్రులకు దుఃఖము పుట్టించుచున్నాడు. అట్టి

  1. పాటలీపుత్రమను దీర్ఘమధ్యముం గలదు.