పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/77

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

వెలుగోటి యాచమనాయఁడు

ద్రోహియై ప్రవర్తించినందువలనఁ బెనుగొండనగరమునఁ జెఱబెట్టి యున్నప్పుడు రాయలకు విశ్వాసపాత్రుఁడై భక్తితో మెలఁగిన రఘునాధనాయనికోరిక ననుసరించి బంధవిముక్తుని గావించెను. ఆవిశ్వాసముచేత నితఁడు తన కుమార్తెలలో నొకర్తును రఘునాధనాయిని కిచ్చి వివాహము చేసెను. ఇట్లు జరిగినను దుర్మార్గుఁడై యీతఁడు రఘునాధనాయని శత్రువు లగుమధురనాయకుఁ డయిన వీరప్పనాయనితోడను, వానిమిత్రుఁడగు జగ్గరాయలతోడను కలసి యల్లుఁడయిన రఘునాధనాయనితోడను. రామదేవరాయల రక్షకుఁ డగుయాచమనాయనితోడను బోరాడుటకు సిద్ధపడెను. యాచమనాయఁడు రఘునాథనాయనితోఁ గలియకుండ నెన్నియో యాటంకములను గల్పించి యడ్డు పెట్టుచు వచ్చెను. ఇంకను విశేష మేమన నితఁడు పోర్చుగీసువారికిఁ బరమమిత్రుఁడు గాఁ గూడ నుండెను. వీని సైన్యములలో నొక పోర్చుగీసుపటాలము గూడ నుండెను.

ఈ పోర్చుగీసుభటులను యజ్ఞనారాయణదీక్షితులు తన సాహిత్యరత్నాకరమునందు 'పొడవుగ నుండు మీసములు గలవారనియు, వంగిన కనుబొమ్మలు గలవా రనియు, కోలమోము గలవా రనియు, రాగిరంగు మేనులు గలవా రనియు, టోపీలలో నెఱ్ఱని పక్షియీకలను ధరించువా రనియు, ఎఱ్ఱని లాగులను తొడుగువా రనియు, కవచములు ధరించువా రనియు, పెద్దకత్తులను చేఁబూనువా రనియు