పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/61

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

వెలుగోటి యాచమనాయఁడు

గనుక సాధ్యపడదు గాన రెండవవాడు, పండ్రెండేండ్లబాలుఁడు గావున వాని నెటులయిన నాకడకుఁ జేర్చఁ గలిగితివా, నీకును, నీ సంతతివారికిని జన్మదారిద్ర్యము తీర్చునంతటి బహుమానమును గావింతు' నని ప్రోత్సహించెను. వాఁడు పరమానందముఁ జెంది ప్రభూ! ఈకార్యము నాకును విధ్యుక్తధర్మమే గావున నవశ్యము నట్లు గావించెద నని పలికెను. అప్పుడు యాచమనాయఁడు చెరలో నున్నరంగరాయలకు నీసమాచారము దెలుపుచు రెండవకుమారుని వీనివశము చేయవలసిన దని యొక జాబు వ్రాసి వానికిచ్చెను. ఆచాకలివాఁడాజాబుఁ దీసికొని కన్నుల నద్దికొని యాతనికడ సెలవు గైకొని వెడలిపోయెను.

ఆజాబును చాకలివాఁడు తనవంతుదినము రాఁగానే శుభ్రముగావించిన రాయలబట్టల నడుమ పైకిఁగనఁబడకుండు నట్లుగా మడతలలో నిమిడ్చి కోటలోని కారాగృహమునకు యధారీతినిఁ బోయెను. కావలివా రెవ్వ రనుమానించ లేదు. అట్టుపోయి యాజాబును రంగరాయలకిచ్చెను. అతఁ డాజాబును చదువుకొని యాచమనాయఁడు దనయందుఁ గనుపఱచెడు భక్తివిశ్వాసముల కాతనిమెచ్చికొనుచు రెండవకుమారుని రామదేవరాయనిఁ బిలిచి యాసంగతి నంతయు నాతనికి నచ్చఁజెప్పి నీ కెంతమాత్రము భయము లే దని బోధించి యాపండ్రెండేండ్లబాలుని వానిపరము చేసెను. వాని నొక గంపలోఁ బరుండఁ బెట్టి మాసిపోయిన గుడ్డలతోఁ గప్పి పైన