పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/33

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

విశ్వనాథనాయకుఁడు

తెంగాశి పాండ్యులని యింతకుఁ బూర్వము తెలిసికొనియున్న వారము. తెంగాశి పాండ్యు లైదుగురు వీరు పంచపాండ్యులని పరఁగినవారు. పంచపాండ్యులనునది ప్రాచీనకాలమునుండి వ్యవహరింపబడుచున్న సమాసపదముకాని నేడు క్రొత్తగ సృజింపఁబడినది కాదు. వీరిలోఁ బరాగ్రమపాండ్య దేవపెరుమాళ్లనునతఁడు ప్రముఖుఁడుగా నుండెను. వీరికి కులశేఖరదేవుఁ డను నామాంతరము గలదు. ఇతఁడు 1543 వ సంవత్సరమున తెంగాశిలోఁ బట్టము గట్టుకొనియెను. ఇతఁడే విశ్వనాథనాయనివారిని ప్రతిఘటించి నిలిచినవాఁడు. తక్కినవారు వీనికిఁ దోడ్పడిరి. వీరి ప్రతిఘటన వృత్తాంతమును దెలిసికొని విశ్వనాథనాయనివారు వీరినిజయించుటకై తమ దళవాయియగు 'అరియనాథ మొదలారి' నిఁ గొంతసైన్యముతోఁ బంపించెను. అప్పుడు తెంగాశి పాండ్యులకును, విశ్వనాథనాయనివారి సైన్యములకును బెనుపోరాటము జరిగి యా యుద్ధములో దళవాయి యరియనాథమొదలారి వారిని జయింపలేక యవమానముతో మధురాపురమునకుఁ బాఱివచ్చి తనప్రభువునకు తలవంపులు గొనితెచ్చెను.

అట్టితలవంపులను విశ్వనాథనాయనివారు భరింప జాలక రెండవమాఱు తానే మహాసైన్యముతో దండెత్తిపోయి వారల దుర్గమును ముట్టడించి యాఱుమాసములవఱకు ఘన ప్రయత్నములు గావించినను దుర్గము స్వాధీనమురాకపోవుటయెగాక యుభయసైన్యములును నాశనమునొందుచుండుటఁ గన్నులారగాంచెను.