పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/14

ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వనాథనాయకుఁడు

11

పఁజాలను. మీరు నాకు తండ్రిగాదు. నేను మీకుమారుండను గాను. మీరు సంపాదించిన రాజ్యముతో నాకుఁ బనిలేదు. నా మాట విని మీరు నాతోడ వచ్చెదరా మీకును నాకును శ్రేయస్సు కలుగును. మీ ప్రాణములకు భయములేకుండఁ జేసికొన వచ్చును. ఒకవేళ మీరు యుద్ధమునకే సంసిద్ధులయిన యెడల మీకు దైవము జయము సమకూర్పఁడు. ఏవిధమున నైన నా ప్రతిజ్ఞను నేను నెఱవేర్చుకొని పోదునుగాని మీరు తండ్రు లని మన్నించి విడిచిపెట్టువాఁడను గా నని తెలిసికొని మఱి ముందుకు సాగుడు. మిమ్మును సజీవముగ రాయలవారి సాన్నిధ్యమునకుఁ గొనిపోవుటయే నేను సకలసామ్రాజ్య మేలుటగా భావించుకొనువాఁడను."

ఇట్టి పల్కులు చెవి సోకఁగా నాగమనాయఁడు కటకటం బడుచు 'ఆహా! నాదురదృష్టము! పుత్రబిక్ష పెట్టుమని విశ్వనాథునిఁగూర్చి తపస్సు చేసినందుకు నా మహాదేవుఁడు తనపై కత్తిచేపట్టు కుమారునిఁ బ్రసాదించెగదా' యని దుఃఖపడి తుదకు ధైర్యము తెచ్చుకొని 'ఇట్టికొడుకు బ్రదికియుండియుఁ జచ్చినవానితో సమానుఁడే యని తలపోసి యెట్టకేలకు నర్జునుఁడు బబ్రువాహనునితోఁ బోరాడినవిధమును స్మరించి వానితో యుద్ధముచేయుటకే నిశ్చయించుకొని రాణువకూర్చుకొని యుద్ధసన్నద్ధుఁ డయ్యెను. ఈ రీతిగాఁ దండ్రికిఁ గొడుకునకు మహాభయంకరమైన యుద్ధము జరిగెను. ఇట్లు మహాఘోరముగా జరుగు సంకులసంగ్రామమున వృద్ధసేనాని నాగమనాయఁడు పట్టువడి విశ్వనాథనాయని కడకుఁ గొనిపోఁబడియెను.