పుట:1857 ముస్లింలు.pdf/223

ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

దాకా ఊరంతా తిరుగుతూ, కూడళ్ళలో, బజార్లలో వేలాడే శవాలను పట్టుకుపోయి గంగలో పారేసేవి అని వివరించాడు. (1857 మనం మరచిన మహా యుద్ధం, ఎం.వి.ఆర్‌. శాస్త్రి, పేజి.3).

1857లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారిగా ఢిల్లీలో పదవీ బాధ్యతలు నిర్వహించి, తిరుగుబాటును స్వయంగా చూసిన మొయినుద్దీన్‌ హసన్‌ (Moinuddin Hasan) రాసిన 'గదర్‌ 1857' గ్రంథంలో ఉరితీతల పరంపర గురించి రాస్తూ ప్రతిరోజు ఉరితీతలు సాగాయి. వేలాదిగా ఉరికి గురయ్యారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి వేలాదిగా ఉరితీయబడ్డారు. భారత దేశ వైశ్రాయి జాన్‌ లారెన్స్‌ పంజాబు నుండి ఢిల్లీ వచ్చాక మాత్రమే ఉరితీతలు ఆగాయి. ఆయన వచ్చాక విచారణలు జరిపి శిక్షలు విధించటం ఆరంభమైంది (పేజి.47) అని పేర్కొన్నారు.

ఆంగేయ 'నాగరికుల' అనాగరికత

ఈ రకమైన విధ్వంసం, హత్యాకాండలను ఆంగ్లేయ సైన్యాలు ప్రతిచోటా సాగించాయి. 1857 తిరుగుబాటు ఆరంభంమయ్యాక ఢిల్లీకి తరలి వస్తూ దారిలోని ప్రతి గ్రామం, ప్రతి అనుమానితునికి వ్యతిరేకంగా ఆరంభించిన రాక్షస కాండను ఢిల్లీ నగరం తిరుగుబాటు యోధుల నుండి చేజిక్కించుకున్నాక కూడా ఢిల్లీ నగరవాసుల నుండి పరిసర ప్రాంతాల ప్రజల వరకు సాగింది.

డిల్లీని చేజిక్కించుకున్నాక దేశంలోని పలు ప్రాంతాలలో ప్రజ్వరిల్లిన తిరుగుబాటు జ్వాలలను అదుపులోకి తెచ్చిన ఆంగ్లేయులు ఆయా ప్రాంతాలలో కూడాతమ విధ్వంస కాండను యధేచ్ఛగా సాగించారు. ఈ వినాశకర కృత్యాలకు అవధ్‌, కాన్పూరు, అలహాబాద్‌, పరూఖ్‌ఖాబాద్‌, రోహిల్‌ ఖండ్‌ తదితర సంస్థానాల కేంద్రస్థానాలు, ఆ సంస్థానాల పరిధిలోగల ఇతర గ్రామాలు బలయ్యాయి. ప్రధానంగా అవధ్‌, కాన్పూరు సంస్థానాలు ఆంగ్ల సైనికుల దోపిడి, హత్యాకాండలకు గురయ్యాయి.

లండన్‌లోని ది టైమ్స్‌ పత్రికకు ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ వార్తలను పంపించడానికి ప్రత్యేకంగా ఇండియా వచ్చిన పాత్రికేయుడు విలియం హావర్డ్‌ రస్సెల్‌ (William Howard Russell) లక్నోలోని రాజప్రసాదాలలో ప్రవేశించిన ఆంగ్ల సైనికులు, సెనికాధికారులు సాగించిన దోపిడి-విధ్వంసాల గురించి ది టైంసుకు వివరాలు పంపాడు.

220