పుట:1857 ముస్లింలు.pdf/15

ఈ పుట ఆమోదించబడ్డది

వలసవాద ఆర్థిక విధానాలతో చితికిపోయిన రైతాంగం పోరాటంలో పాల్గొన్న వివరాలనూ, విధానాన్నీ చూపించారు. సిపాయీలు 'తిరుగుబాటు' చేయడంలోని రైతాంగ కోణాన్ని చూపించారు. సిపాయీలు వాస్తవంగా 'Pesants in uniform' (సైనికులుగా పనిచేస్తున్న రైతులు) అనే విషయాన్ని నిర్ద్వందంగా నిరూపించారు. ఒకవైపు ప్రజా భాగస్వామ్యాన్ని నిరూపిస్తూనే దీన్ని 'జాతీయ పోరాటం' అనడంలోని సమస్యల్ని మనముందుంచారు.

ఏది ఏమైనప్పటికీ విజృంభిస్తున్న జాతీయవాద హవాలో 1857 పోరాటాన్నీ 'జాతీయవాద పోరాటం'గా అంగీకరించడం పట్ల సాధారణ భారతీయులు మొగ్గు చూపు తున్నారు. రాజ్యం కూడా ఈ దిశగానే బలంగా ప్రచారం చేస్తోంది. ప్రస్తుత పుస్తక రచయిత సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ కూడా పోరాటంలో భారత జాతీయభావాన్నే చూస్తున్నారు. ఈ 'జాతీయ పోరాటం'లో ముస్లింల భాగస్వామ్యాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు: తన వాదనా నుగుణంగా పలు సాక్ష్యాధారాలను పొందుపరుస్తున్నారు.

తొమ్మిది అధ్యాయాలూ, విలువైన అనుబంధాలు ఉన్న ఈ పుస్తకంలోని ప్రతి అధ్యాయమూ ప్రత్యేక అంశానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించటం తోపాటు ముస్లిం సమాజం పట్ల కొనసాగుతూ వస్తోన్న పలు అపోహలూ, అనుమానాలూ, దురూహలను పరోక్షంగా బద్దలుకొట్టి వాస్తవరూపాన్ని మనముందుచుతుంది.

మొదటి అధ్యాయం 1857 పోరాటానికి సంబంధించిన కథను అంటే ప్రారంభం, కొనసాగింపు, వివిధ వర్గాల పాత్ర, పతనాలను రేఖామాత్రంగా వివరించి మనల్ని ప్రధాన వస్తువు అయిన ముస్లింల పాత్ర దగ్గరికి తీసుకెళ్తుంది.

రెండవ అధ్యాయంలో పోరాటంలో పురుషులకు దీటుగా పాల్గొని ప్రాణత్యాగం చేసిన మహిళల గూర్చి చర్చిస్తుంది. బేగం హజ్రత్‌ మహల్‌ లాంటి కొంతవరకు తెలిసిన రాణులతోపాటుగా మనకు ఏమాత్రం తెలియని బేగం అజీజున్‌, ముందర్‌, హబీబా, అస్గరీ బేగం, పచ్చదుస్తుల మహిళ బలిదానాలను తెలియజేేస్తుంది. పురుష కేంద్ర చరిత్రను బద్దలు కొడుతూ మహిళలను ఒక ప్రత్యేక అధ్యాయంలో చర్చించడం పుస్తకానికి గొప్ప విలువను చేకూర్చింది. 'పర్దానశీన్‌' (పర్దాల మాటున్న వారు)లుగా భావించబడే ముస్లిం మహిళలు Public Space లోకి వచ్చి మాతృభూమి కోసం పోరాడి బలికావడమనే విషయం ముస్లిం స్త్రీల గూర్చి ఉన్న అపోహల్ని పటాపంచలు చేస్తుంది. కానీ ఈ ముస్లిం మహిళల్ని Icons గా తయారు చేసి, ప్రచారం చేసి ముస్లిం స్త్రీలలో ప్రేరణ కలిగిచడంలో యిప్పటి ముస్లిం