పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/17

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

హిందూకోడ్ బిల్ సమీక్ష

నాలుగయిదువేల యబ్దములకు బూర్వమందలివని నిశ్చయించబడినపు డా భాషల శబ్దములు ఈశ్వరసంబంధమగు ననాది విజ్ఞానమందెట్లు సమావిష్టములై యుండును ? కావున సంస్కృతభాషకు చెందిన వైదిక శబ్దము లే యా విజ్ఞానమందు సమకూర్చబడినవని భావించుట యుక్తి యుక్తము. ఈ విధ ముగా సమస్త విశ్వము నీశ్వరకృతమై, యీశ్వరవిజ్ఞానము తోడను, యీశ్వరేచ్ఛతోడను, యీశ్వరకృతితోడను సంపన్నమైయుండ, నా విశ్వమునకు బూర్వమందు ఈశ్వర కృతియు, నా కృతికి బూర్వమున నీశ్వరేచ్ఛయు, నాయిచ్ఛకు ముందు యీశ్వరజ్ఞానము, నాజ్ఞానమం దనువిద్ధములగు శబ్దములు నున్నటులే ఆ శబ్దములే వైదికశబ్దములైన నీ సృష్టి శబ్దపూర్వకమైన దన్న మాట. శబ్దానువిద్ధములగు జ్ఞానేచ్ఛాకృతుల తోడ నీశ్వరుడు ప్రపంచనిర్మాణము చేయును. దీనిని బట్టి శబ్దమర్థపూర్వకము కాదనియు, నర్థమే శబ్దపూర్వక మనియు స్పష్టమగు చున్నది. ఇట్లే ఘటన జరిగిన తరువాత నాఖ్యానము కాదనియు, నాఖ్యానానంతరమే ఘటనయనియు గూడ సువ్యక్తమగు చున్నది. కుంభకారుడు తన మనమున కుంభశబ్దమును భావించి, కుంభజ్ఞానమును కలుగజేసుకొని కుంభనిర్మాణము జేయుచున్నటులే, ఈశ్వరుడుకూడ వేదశబ్ద ముల మూలమున విశ్వజ్ఞానమును గలుగజేసుకొనియే సమస్త విశ్వనిర్మాణమును జేయును. మనువుకూడ నుడివియుండెను. - "వేదశబ్దేభ్య ఏవాదౌ పృథక్సంస్థాశ్చ నిర్మమే" అనగా బరమేశ్వరుడు వేదశబ్దములచేతనే విశ్వనిర్మాణము సేయును .