పుట:హాస్యవల్లరి.pdf/60

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూ - కాలిమీద.

స - ఇంతేగదా! నీకు కాళ్ళులేవనుకో, పోయిందా?

సూ - అల్లా అనుకుంటే కింద పడాలి. ఏమీపోలేదు.

స - ప్రపంచంలో తేళ్ళులేవనుకో - పోయిందా ఈ మాటు?

సూ - ఇదివరకి చిమచిమలాడేది ఇప్పుడు అగ్నిహోత్రం పుంతయింది.

స - (ఊది) ఈ మంత్రంతో కుదరకపోతే బ్రహ్మాదులొచ్చినా ఇంతే. ఈ మాటు పోలేదూ?

సూ - పోయిందయ్యా మహప్రభో!

పక్కని ఉన్న సుబ్బన్న - నిజంగానే సూర్యం?

సూ - నిజంగానే, ఈయన నన్ను పెడుతూన్న బాధముందు.

225

చిదంబరం కొత్త సైకిల్ మీద పోతూండగా ఒక మేష్టరుగారు ఎదురై,

మే - ఏమోయ్! నీకు పెళ్ళిఅయి ఎన్నాళైంది?

చి - స్వధనం రెండువందలండి, "లైటూ” “బెల్లూ” కలుపుగుని.

మేం - ఒప్పుగున్నాం!

226

ఒక నల్లదొర తను “మాజిక్” చేస్తానని ఒక పల్లెటూరిలో కొన్ని నోటిసులు గోడలకి అంటించి మరికొన్ని స్వయంగా జనానికి జారీచేయగా, మర్నాడు చంద్రుడూ అనంతం దాన్ని గురించి మాట్లాడుకుంటూ,

చం - అయిందిటగా, “మాజిక్” రాత్రీ!

అ - లేదుటరా,

చ - అబ్బ అయిందిట.

అ - లేదు. నామాట కాస్త వినుమరీ, దాంతగలెయ్యా! పొద్దున్న ఆయననోటంటేవింటా. ఒక్కడూ రాలేదుట.

చం - అల్లాఅయినా, అయిందన్నమాటేరా!

అ - లేదురా.

చం - నీ మొహం! ఒక్కడూ రాకపోడం ఏమిట్రామరీ, “మాజిక్” కాకపోతే?

227

రాముడు - వసిష్ఠుగారూ! మీరు యజ్ఞంచేశారూ?

వ - ఆ.

రా - ఎందుకండీ అదిచెయ్యడం?

వ - ముక్తికోసం.

రా - అంటే?

వ - అంటే, రంభాసంభోగం! తెలిసిందా?

రా - ఈమాటు తెలిసింది. మీరొక్కరేనా ఇది చేస్తా?

వ - ఏడిసినట్టేఉంది. మా ఆవిడ కూడాలేకపోతే యజ్ఞం ఎల్లా చెల్లుతుంది?

రా - అల్లాయితే ఆవిడముక్తి ఏ భోగంతోటీ?

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

50

హాస్యవల్లరి