పుట:హాస్యవల్లరి.pdf/43

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

149

కొండలరావుగారు జిగురుతొట్టిలో ఉన్న జిగురుతో ఉత్తరం అంటించడం చివరదాకా చూసి,

రత్తమ్మ - నాన్నా! ఇది మల్లీ తియ్యత్తా?

కొం - ఆ. నీ కెందుకులేస్తూ, తొట్టి గూట్లో పెట్టిరా.

ర - అమ్మకిత్తాను.

కొం - ఎందుకూ?

ర - అన్నయ్యేం, అమ్మదాతిన దబ్బులు తీత్తునాత్త! దీంతో కల్లు అంతింతమంతాను. మల్లీ తియ్యత్తుగా.

150

గోవిందశాస్త్రి - అందుకనే కదండీ, నారద మహామున్లవారు, ఎంత మహత్సంపన్నులైనా, ఎంత దేవమున్లైనా, నిత్యమూ నున్నూ కూడా ఆయొక్క శ్రీకృష్ణభగవాన్లవారి దర్శనం విడవకుండా పొందుచూండే వారషా!

గిరీశం - డామిట్. నాకు తెలియనట్టు చెప్తారేం? కృష్ణుడు ఒక షెపర్డు అనగా గొల్లవాడు. అతనికి పాలు లావుగా ఉండేవి. ఇది కనిపెట్టి కానీ ఖర్చుకాకుండా రోజూ కాఫీ టైమ్కి మిష్టర్ నారదుడు కృష్ణుడు లాడ్జికి జేరుకునేవాడు.

151

సుబ్బారాయుడు - వెంకన్నా! రాత్రివేళ స్మశానంలోకి నువ్వు ఒక్కడవూ వెళ్లగలవ్?

వెం - దంచేసి.

సు - ఏడిశావ్. మొఖం తేలేస్తావు భయమేసి.

వెం - ఛీ కావలిస్తే కూడా వచ్చి చూస్కో

152

నాటకశాలలో,

పరాత్పరరావు - ఏమండీ! ఆ అశ్వత్థామ శాలువ పైన తెల్లటిది ఏమిటి?

పూర్ణానందం - దంధ్యం.

ప - అది పైన వేసుగున్నాడేం?

పూ - ఇహ కాస్సేపట్లో తనికి దారుణకోపం వస్తుందనీ, అప్పుడు తను దంధ్యం తెంపుగోవలివస్తుందనీ, వాడెరుగు. చేతి వీలుకోసం పైన పెట్టుగున్నాడు.

153

శాస్త్రిగారు రాజమండ్రీనించి ధవిళేశ్వరం జట్కా కట్టించి, ఎక్కి పోనిమ్మని బండివాడితో అంటూండగానే గుర్రం హరామీ చెయ్యగా,

బండీవాడు - అయ్యా! గుర్రం వెనక్కి నడుస్తోంది.

శా - నాకూ తెలుసు. ఇప్పుడు నేను ఏం చెయ్యవలసి ఉంటుంది.

బం - దిగాలి.

శా - నీకు చాదస్తంగాని దిగడం ఎందుకూ?

బండీ రాజమండ్రీ కేసి తిప్పితే సరీ, పని జరిగిపోతుందీ!

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

33

హాస్యవల్లరి