పుట:హాస్యవల్లరి.pdf/157

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కూడా ప్రయత్నించి, ఆవిడ తిట్లప్రవహంలో మొదటకొట్టుకుపోయి, మధ్య ములిగిపోయి, చివరకి తేలిపోయారు. 'హరి' అనే వరకూ ఆవిడిదే పై చెయ్యిగావును - (కాదు! పైనోరు గావును) ఆవిడప్రభ అల్లా వెలగవలిసిందేగావును, తిట్టగలవాళ్ళది రాజ్యంగావును, అనుకుంటూ లోకులు నిరాశలో పడి పోయారు.

కాలం జరిగింది. జరక్కుండా కూచోంది అదొక్కటేగా! ఆవిడిమీది కంట్రకత్వం పడింది. ఆవిడికీ కుంచం నిండింది. ఒకనాడు పొద్దున్న తొమ్మిదింటికి ఆవిడ అరుగుమీద చతికిలబడింది. క్రితం నాడు పక్క ఊరు తీర్థాని కెళ్ళి రాత్తిరి ఇంటికి చేరుకునే సరికి ఆవిడికి పులకారం వచ్చినట్టుండి వొళ్లంతా పచ్చిపుండైంది. ఉదయం అషీషూ లేచి, అత్తీసరు పడేసి, తరవాత ఎదో యింత వడియాలపచ్చిపులుసు చేసుకోవచ్చు కదా అనుకుని, మడిగానే ఆవిడ అరుగుమీదికి వచ్చింది. ఒక ఎరకలాడు ఆవీధంట వచ్చాడు. వాడు, మొలకి గోణం, తలకి పొణకంతపాగా, చెవలకి తమ్మెట్లూ, ఎడంచెవికి బావిలీ, ముక్కుకి కాడా, చేతులికి వెండిమురుగులూ, కుడిదండకి కడియం, చేతులో నక్క పిల్లి కర్రా, జనపనారతాడు చుట్టా, నోట్టో రూళ్ళకర్రంత ఉండి వెంటిలాగ రాజుతూన్న పొగచుట్టా, మీసాలచెప్పులూ వగైరాతో మహ అట్టహాసంగా వచ్చాడు. ఒకవిశేషం. వాడిచుట్ట రెండుమూడు నెల్లు వరసని కాల్చుగునే బాపతుది. దాని పొడుగుమూలాన్ని అది వాలిపోయి, జ్వాలా తోరణంలా ఒకసారే తగులబడిపోకుండా, వాడు దానిమధ్య ఒక నూకల తాడు ముడేసి, నోట్లో ప్రతిష్ఠించినప్పుడు అది మట్టంగా ఉండేలాగు ఆతాడు అవతలకొస పట్టిగెళ్ళి తలపాగాకొంగుకి కట్టేశాడు. పళ్ళగంపచుట్టూ మూగినట్టు జనం వాణ్ణి మూగికొందరూ, వెంటాడించి కొందరూ వచ్చారు. సిమాలమ్మకి కొంచెం ఆశ్చర్యం వేసింది. “ఏవడ్రా ఇన్నాళ్ళకి ఇల్లా తెగించి రాగలిగాడూ!” అని. కానీ, అల్లాంటివాణ్ణి తిట్టి, సాగనంపగలిగితేనే తన వాగ్జన్మకి సాఫల్యం అనిన్నీ, అంత గొప్ప తరుణంలాంటిది మళ్ళీ మళ్ళీ తనకి దొరకకపోవచ్చనిన్నీ, ఆవిడికి అనిపించి, ఆవిడ తనమనస్సులో ఉన్న తిట్ల దస్తరాలు తిరగేసి, కొన్ని ముఖ్యమైనతిట్లు కేటాయించి ఏరి, నూరి, చిన్న చిన్న కట్టలుగా కట్టి, ప్రయోగించడానికి తగ్గస్థితిలో పెట్టింది. వాడు ఆవిడిల్లు సమీపించాడు. అసలు వాడు తాడిచెట్టులో సహం ఉన్నాడు. వాడికర్ర వాడు నిఠాగ్గూ పట్టుగున్నప్పుడు అది వాణ్ణి దాటిపోయి, తాడిదన్నేవాడి తలదన్నే వాణ్ణి జ్ఞాపకం చేసింది. వాడువచ్చేసి సరసరా ఆవిడింటి గుమ్మాలు ఎక్కేసాడు. వొఠ్ఠికిరాతపుముండావాడొచ్చాడే అనుకుని ఆవిడ కొద్దిగా నిర్ఘాంతపోయి లేచినిలబడి దవడలు నొక్కుగుని, “అయ్యో! అజ్జో! అచ్చో! నీతాడు తెగా, నీదుంపతెంపా, నీవేరుతవ్వా! నేను మనిషి ననుకున్నావా, పందిననుకున్నావురా, నిందగలెయ్యా!” అని ప్రారంభోపన్యాసం యిచ్చింది. వాడు గడపదాకా ఎక్కి, అక్కడ అగి, తనమూతి పైకి ఎత్తిపట్టి, చుట్టుతీసి, “ప్ధూ” అనే పెద్ద శబ్దంతో ఇంట్లో పడేలాగు కడివంత ఉమ్మెసి, వీధికేసి తిరిగి, చుట్ట మళ్ళీ నోట్లో స్థాపించి, నులకతాడు బిగించి, గుమ్మంమీద కూచున్నాడు. సిమాలమ్మ, నడుం బిగించి, పళ్లు బిగించి, చేతుల్లో గాల్నిపొడుస్తూకొంచెం వడిగా, “ఓరి వెధవా, వెథవన్నరా! కుంకా! దోయంకుంకా! కుంకాక్షీ! చెవలవెధవా, చెవుల్తెగిన వెధవా! మరీపొయ్యకాలంవచ్చిందేంరా! హోమంచెయిస్తా! నీకొవ్వొండిస్తా! నీపొగరుతీయిస్తా! అమ్మ వెధవపొగరా!” ...

అంటూ కాస్తదార్లోపడుతూండేసరికి, ఎరకలాడుఛంగున గద్రిగాడులాగ ఆవిడ యెదట ఓగజం ఎడంలోకి గంతేసివాలి, చుట్టతీసి పట్టుగుని, ఒక గొప్ప మేఘమండలం

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

147

హాస్యవల్లరి