ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 1.

13


చ.

మునివర యివ్విధంబున సముద్భవ మొందెఁ బృథుండు? ధాత్రి యే
యనువున దోహయోగ్య యగునట్లుగఁ దా నొనరించె? నెవ్వర
మ్మనుజవరేణ్యుపన్పున సమంచితవస్తువిశేషదోగ్ధలై
రనయముఁ జిత్ర మట్టితెఱఁ గంతయు నా కెఱిఁగింపు నావుడున్.

98


పృథుచక్రవర్తి భూమిని గోవుఁగాఁ జేసి వస్తువులు గొన్న ప్రకారము

వ.

అతనికి వైశంపాయనుం డిట్లనియె.

99


సీ.

ఆదియుగంబున నంగుండు నాఁ జను భూమీశ్వరుఁడు మృత్యుపుత్రియైన
నీరజనయన సునీథయం దధికబాహాసముద్ధతు వేనుఁ డనుతనూజుఁ
గనియె రాజై వాఁడు తనదుమాతామహుఁ బోలి క్రౌర్యంబునఁ బుడమిజనులఁ
బీడించి ధర్మంబుఁ బెడఁబాయఁగాఁ ద్రోచి వేదవిరుద్ధదుర్వృత్తి మరగి


తే.

యెల్లవారలఁ బిలిచి మీ రేసుకృతము, నాచరింపఁగ వలదు మీ రధ్వరముల
తెరువు వోకుఁ డీమేర నతిక్రమింతు, రేని జంపుదుఁ జెఱుతు నెవ్వానినైన.

100


తే.

యజన మిజ్యుండు యష్ట నా నతిశయిల్లు, నిన్ని తెఱఁగులవస్తువు లేన కాఁగఁ
దలఁపుఁ డేమేని కర్జంబు గలిగెనేనిఁ, [1]బన్నుగా నది చేయుఁడు నన్నుగుఱించి.

101


వ.

అని యాజ్ఞాపనంబు సేసిన.

102


సీ.

జపములు గాయత్రి సహితంబుగా [2]మాసె వేదంబు పేరును వినఁగ లేద
సోమపానక్రియచొప్పులు [3]రూపఱె హుతములు కఱవయ్యె హుతవహునకు
సర్వదైవతసమర్చలు గట్టిపెట్టంగఁ[4]బడిన భూతంబులపనులు సమసెఁ
బరహితంబులు దానపరతలుఁ గడతేఱె సతతవ్రతోపవాసములు పొలిసె


తే.

[5]స్వామిచందంబు చందమౌ జనుల కనిన, మాట నిజముగ వేనక్షమాతలేశుఁ
డఖిలధర్మపరాఙ్ముఖుఁ డయిన నతని, మతము చెల్లించి రెందును మనుజకోటి.

103


వ.

[6]ఆమెయికిఁ దలంకి తపస్వివరు లెల్ల నమ్మహీపాలుపాలికిం జనుదెంచి.

104


మ.

జనసంత్రాసనవృత్తి, [7]జేయఁదగునే సత్కర్మ నిర్మూలనం
బొనరింప న్నృప నీకు నిట్లు విను మే మొప్పారఁ బెక్కబ్దముల్
[8]జనుయాగం బొనరింపఁజూచెదము విశ్వక్షోణికిన్ రాజ వీ
వనుకూలుండవు గమ్ము మాక్రియకు ధర్మాయత్తచిత్తంబునన్.

105


తే.

క్షత్రియునిఁ దెచ్చి తొలితొలి గద్దియనిడి, పట్టబద్ధుఁ గావించుచోఁ బ్రజలు దమ్ముఁ
గావ ధర్మంబు నడపను గాదె సమయ, మర్థిఁ బలుకుదు రీ వది యరయవలదె.

106
  1. బన్నుగాఁ జేయుఁడీ మీరు నన్నుగుఱిచి
  2. మానె
  3. రూపేదె
  4. బడియె బూర్తంబుల (పూ. ము.)
  5. స్వామిచందంబు సేవకజనుల స్వామిచందంబె చందంబు; స్వామిభృత్యులచందంబు జనుల కనిన, మాట నిజము లేదయ్యె క్ష్మాతలేశు.
  6. అమ్మెయిఁ దలరి
  7. చేర్చఁదగునే
  8. విను యాగంబు దొడంగఁజూచెదము నీవీ (పూ. ము.)