ఈ పుట అచ్చుదిద్దబడ్డది

504

హరివంశము

తే. దొరలు గడిమి విష్వక్సేనుతోడఁగూడి, భీతకోటి నాశ్వాసించి పేర్చి సర్వ
     సైన్యములఁ బురికొల్పి యాశత్రుమీఁదఁ, దెచ్చి క్రమ్మఱఁ దల పెట్టి రచ్చెరువుగ.100
వ. అమ్మహాయుద్ధంబున నసాధ్య యగు సాధ్యధ్వజిని నుద్ధతద్విరదబృంహితంబులు
     బహుళహయహేషితంబులుం బ్రథితరథనేమినినదంబులు బ్రకటభటసింహనా
     దంబులు నుద్దండకోదండవిస్ఫారంబులు విశంకటశంఖధ్వానంబులు నుదారభేరీ
     నిస్సాణరావంబులు నొక్కటి యై బ్రహ్మాండకర్పరదళనదర్పంబునఁ జెలంగె శరం
     బులుఁ దోమరంబులు శక్తులు గదలును గరవాలంబులు భిండివాలంబులుఁ బరి
     ఘంబులఁ బరశువులు మఱియును బహువిధంబు లగు నాయుధంబులు శూరనికర
     కరోచ్చలితంబు లయి సముచ్చండరోచులం జండకరసహస్రవిస్రంసనం బొనర్చె
     నాభీలం బగు ధూళిజాలంబు సకలమాలిన్యకారి యై యంధకారంబు ననుకరించె
     నట్లు దారుణం బగు వైరుల యాక్రమణంబు సైరింపక విరోచనుండు.101

విరోచనుండు విష్వక్సేనప్రముఖదేవతలతో మార్కొని ఘోరయుద్ధంబు చేయుట

క. అసితఫణిభీషణం బగు, నసి చేకొని యాయతమగు నంసమున నమ
     ర్చి సముద్ధతి నరదము డిగి, మసరుకవిసి కదిసె మారి మసఁగినభంగిన్.102
వ. ఇవ్విధంబునం గడంగి.103
సీ. ధనువులు దెగవ్రేసి తనువులు దెగవ్రేసి శిరములు దెగవ్రేసి కరములోలిఁ
     దెగవ్రేసి పడగలు దెగవ్రేసి గొడుగులు దెగవ్రేసి రథములు ద్రెవ్వవేసి
     కరులఁ ద్రెవ్వఁగవ్రేసి హరులఁ ద్రెవ్వఁగవ్రేసి రధికుల వ్రేసి సారథుల వ్రేసి
     యాశ్వికతతి వ్రేసి హాస్తికావలి వ్రేసి భటసమూహము వ్రేసి బల మెలర్ప
తే. నెచటికేనియు నురికి యెందేనిఁ జొచ్చి, యెట్టివానిని మిగిలి యె ట్లేనిఁ జేసి
     వేయు దెఱఁగులఁ జిత్రంపువిన్ననువులఁ, జంపె నొప్పించెఁ బఱపె నిర్జరబలముల.104
వ. ఇబ్బంగి నపహతసేనుం డై విష్వక్సేనుండు పలాయనంబ పరాయణంబుగాఁ
     బాటించెఁ దత్సహాయులు నతనిజాడన యరిగిరి కుజంభుం డంశునిం బెక్కుబాణం
     బులఁ బరిక్షీణప్రాణునిం జేసిన నయ్యాదిత్యుండు తన చుట్లం బన్నిన నగంబులుం
     బోని నాగంబులం బదివే లతనిపైఁ బురికొల్పిన నవి ప్రళయకాలకాళికా
     కఠోరంబు లై ఘోరగర్జాతర్జనంబుతోడ నడరిన నాహిరణ్యకశిపునందనుండు
     గదాహస్తుం డై రథంబు డిగ్గి.105
క. శతమన్యుఁడు శతకోటి, క్షతపక్షతులుగ నమర్చి శైలముల మహీ
     పతితములు చేయుపగిదిని, మతంగజప్రసతి నెల్ల మడియించె వెసన్.106
తే. అంశునరదంబు దెసకునై యాది గొనిన, నతఁడు నిలువంగ వెఱచి సురాధినాథు
     దెసకు సురిఁగె రయంబునఁ దేరు డిగ్గి, యసుర పొరివుచ్చెఁ దరవారి నహితబలము.107